breaking news
lorry and bike
-
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. ముగ్గురు యువకుల దుర్మరణం
నాగులుప్పలపాడు/మేదరమెట్ల: వినాయక చవితికి గ్రామంలో ఏర్పాటు చేసే విగ్రహాన్ని కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చి బైక్‌పై తిరిగి వెళ్తుండగా ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మద్దిరాలపాడు సమీపంలోని 216 జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన మర్రిబోయిన గోపి(27) హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అమ్మవారి కొలుపులు, వినాయక చవితి పండుగ నేపథ్యంలో గ్రామానికి వచ్చాడు. అదే గ్రామానికి చెందిన బత్తిన అరవింద్(19), మర్రిబోయిన మణికంఠ(21)లతో కలసి శనివారం రాత్రంతా గ్రామంలో జరిగిన అమ్మవారి కొలుపుల్లో సంతోషంగా గడిపారు. ఆదివారం వేకువజామున 4 గంటల సమయంలో ఒంగోలు వెళ్లి వినాయక విగ్రహానికి అడ్వాన్సు ఇచ్చారు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో మద్దిరాలపాడు గ్రామం వద్ద 216 జాతీయ రహదారిపై పంక్చరు పడిన లారీ ఆగి ఉంది. దీనిని గమనించని యువకులు తమ మోటారు సైకిల్‌తో వెళ్లి బలంగా ఢీకొట్టడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. పమిడిపాడులో విషాదఛాయలు.. గ్రామానికి చెందిన మర్రిబోయిన గోపి(30) ఐదేళ్లుగా హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాది పాప ఉంది. మూడు రోజుల క్రితమే పాపకు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇంతలోనే కొలుపులకు అని వెళ్లిన వ్యక్తి విగత జీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గోపీకి కవల సోదరుడు ఉన్నాడు. మర్రిబోయిన మణికంఠ(22) తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు. తండ్రి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. డిగ్రీ డిస్‌కంట్యూ చేసి ఖాళీగా ఉన్నాడు. వివాహం కాలేదు. బత్తిన అరవింద్(21) తల్లిదండ్రులకు రెండో సంతానం. వివాహం కాలేదు. తండ్రి గొర్రెల కాపరి. చేతికి అందివచ్చిన బిడ్డలను మృత్యువు కబళించడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. -
లారీ దూసుకెళ్లి మహిళ మృతి
తిరువొత్తియూరు: బైక్ చక్రంలో చీర తగులుకోవడంతో రోడ్డుపై పడిన మహిళపై లారీ దూసుకెళ్లింది. దీంతో సంఘటనా స్థలంలోనే ఆ మహిళ ప్రాణాలు విడిచింది. కడలూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. కడలూరు జిల్లా సేద్దియల్‌పురం సమీపం అల్లిలూర్ తూర్పు వీధికి చెందిన వీరమణి (45) ఎలక్ట్రీషియన్. ఇతను శనివారం భార్య వసంత (40)తో మోటారు సైకిల్‌పై సేద్దియాపురం వెళ్లాడు. అక్కడి నుంచి ఇద్దరు తిరిగి ఇంటికి బయలుదేరారు. చెన్నై కుంభకోణం రోడ్డులో మేట్టువీధి వద్ద వసంత చీర బైక్ చక్రంలో చిక్కుకుంది. దీంతో వసంత, వీరమణి అదుపు తప్పి రోడ్డుపై పడ్డారు. ఆ సమయంలో బన్రూటి నుంచి కుంభకోణం వైపు వస్తున్న లారీ వసంతపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలం వద్దే వసంత మృతి చెందింది. గుర్తించిన స్థానికులు తీవ్రంగా గాయడప్డ వీరమణిని చిదంబరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సేద్దియపురం పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేసి వసంత మృతదేహాన్ని శవపరీక్ష కోసం చిదంబరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్‌ను ఢీకొన్న లారీ: యువకుడి మృతి
బూర్గంపాడు(ఖమ్మం): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న రాయల దుర్గ(26) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన చుట్టుపక్కలవారు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు విజయనగర్ కాలనీ వాసిగా గుర్తించారు.