ఎనిమిది మంది దుర్మరణం
ఆళ్లగడ్డలో ప్రైవేటు బస్సును ఢీకొన్న కారు
ఐదుగురు మృత్యువాత
గుంటూరు జిల్లాలో కారును ఢీకొన్న ప్రైవేటు బస్సు .. ముగ్గురు మృతి
రహదారులు శుక్రవారం తెల్లవారుజామున రక్తమోడాయి. అతివేగం, నిద్రమత్తు ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అదుపుతప్పిన కారు.. ప్రైవేటు బస్సును ఢీకొనడంతో ఐదుగురు మరణించారు. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెంలో వెనుక నుంచి వస్తున్న ప్రైవేటు బస్సు రోడ్డు పక్కగా ఆగుతున్న కారును బలంగా ఢీకొనడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ రెండు ఘటనలు బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.
నిద్రమత్తే యమపాశమై..
దొర్నిపాడు: నంద్యాల జిల్లా ఎన్‌హెచ్–40పై ఆళ్లగడ్డ సమీపంలో డ్రైవర్ నిద్రమత్తు వల్ల కారు అదుపు తప్పి డివైడర్‌ను క్రాస్ చేసి మరో రూట్లో వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులంతా క్యాటరింగ్ పనులు చేసుకుని జీవించేవారు.
హైదరాబాద్ బాచుపల్లికి చెందిన గుండేరావు(46), శ్రావణ్(21), సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన నరసింహులు(30), కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన సిద్ధయ్య(50)తోపాటు గుండేరావు కుమారులు సిద్ధార్థ కులకరి్ణ(19), శివసాయి కులకర్ణి ఈనెల 11న అయ్యప్ప భక్తులకు వంట చేసేందుకు శబరిమలైకి కారులో వెళ్లారు. అక్కడ కార్యక్రమం ముగించుకొని తిరుగు ప్రయాణంలో తిరుమలకు వెళ్లారు. స్వామి దర్శనం చేసుకొని గురువారం సాయంత్రం కారులో తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు.
శుక్రవారం తెల్లవారుజామున 2.30గంటల ప్రాంతంలో నల్లగట్ల వద్ద డ్రైవింగ్ చేస్తున్న శివసాయి కులకర్ణి నిద్రమత్తులో కునుకు తీయడంతో వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటుకుని మరో రూట్‌లో హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో గుండేరావు, శ్రావణ్, నరసింహులు, సిద్ధయ్య అక్కడికక్కడే మరణించారు.
సిద్ధార్థ కులకర్ణి, శివసాయి కులకర్ణి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాలను కారు నుంచి బయటకు తీశారు. క్షతగాత్రులిద్దరిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అక్కడ పరిస్థితి విషమించి సిద్ధార్థ కులకర్ణి మృతి చెందాడు. ఘటనాస్థలంలో చనిపోయిన నలుగురిని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడే పోస్టుమార్టం పూర్తి చేశారు. విషయం తెలుసుకున్న మృతుల బంధువులు ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో 40 మంది ప్రయాణికులు
హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళుతున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సులో 40మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రమాదంలో వీరెవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు బస్సును పోలీసు స్టేషన్‌కు తరలించి ప్రయాణికులను ఇతర వాహనాల్లో వారి గమ్యస్థానాలకు చేర్చారు.
ప్రైవేటు బస్సే మృత్యుశకటమై
గుంటూరు రూరల్: వెనుక నుంచి వచ్చిన ప్రైవేటు బస్సు కారును బలంగా ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం, మామిళ్ళమడవ గ్రామానికి చెందిన కంచనపల్లి మధు స్థానికంగా వంటమేస్త్రీ. ఆయనకు భార్య మనీష, పిల్లలు జ్ఞానేశ్వర్, వర్షిత్ ఉన్నారు. పిల్లలిద్దరికీ పుట్టు వెంట్రుకలు తీయించేందుకు తిరుమల వెళ్లాలని కారు మాట్లాడుకున్నారు.
కారులో మధు భార్యాబిడ్డలతోపాటు తల్లిదండ్రులు కంచనపల్లి సుశీల(64) వెంకటయ్య(70) మనీష తండ్రి మన్సూర్, కారు డ్రైవర్ సైదులు(28) మంగళవారం సాయంత్రం ఇంటివద్దనుంచి తిరుమల వెళ్లారు. తిరుపతిలో పిల్లల కార్యక్రమాలు పూర్తి చేసుకుని గురువారం సాయంత్రం విజయవాడకు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం సమీపంలోకి చేరింది.
ఆ సమయంలో డ్రైవర్ సైదులు నిద్ర వస్తుందని కారును పక్కకు తీసి ముఖం కడుక్కుని వెళ్దామని చెప్పాడు. కారును రోడ్డుపక్కన ఆపేందుకు స్లో చేస్తుండగా వెనుకనుంచి అతి వేగంగా వస్తున్న వీఆర్‌సీఆర్ సంస్థకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కారును బలంగా ఢీకొంది. ప్రమాదంలో సుశీల, వెంకటయ్య, డ్రైవర్ సైదులు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలినవారికి తీవ్రగాయాలయ్యాయి.
స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి కారు డోర్లను రాడ్లతో వంచి క్షతగాత్రులను, మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను జీజీహెచ్‌కు తరలించారు. ఎస్పీ వకుల్ జిందాల్, సౌత్‌జోన్ డీఎస్పీ భానోదయ, నల్లపాడు సీఐ వంశీధర్ ఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.


