breaking news
travel buses
-
మృత్యు ‘వే’గం.. రక్తమోడిన రహదారులు
రహదారులు శుక్రవారం తెల్లవారుజామున రక్తమోడాయి. అతివేగం, నిద్రమత్తు ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అదుపుతప్పిన కారు.. ప్రైవేటు బస్సును ఢీకొనడంతో ఐదుగురు మరణించారు. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెంలో వెనుక నుంచి వస్తున్న ప్రైవేటు బస్సు రోడ్డు పక్కగా ఆగుతున్న కారును బలంగా ఢీకొనడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ రెండు ఘటనలు బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. నిద్రమత్తే యమపాశమై.. దొర్నిపాడు: నంద్యాల జిల్లా ఎన్‌హెచ్–40పై ఆళ్లగడ్డ సమీపంలో డ్రైవర్ నిద్రమత్తు వల్ల కారు అదుపు తప్పి డివైడర్‌ను క్రాస్ చేసి మరో రూట్లో వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులంతా క్యాటరింగ్ పనులు చేసుకుని జీవించేవారు. హైదరాబాద్ బాచుపల్లికి చెందిన గుండేరావు(46), శ్రావణ్(21), సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన నరసింహులు(30), కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన సిద్ధయ్య(50)తోపాటు గుండేరావు కుమారులు సిద్ధార్థ కులకరి్ణ(19), శివసాయి కులకర్ణి ఈనెల 11న అయ్యప్ప భక్తులకు వంట చేసేందుకు శబరిమలైకి కారులో వెళ్లారు. అక్కడ కార్యక్రమం ముగించుకొని తిరుగు ప్రయాణంలో తిరుమలకు వెళ్లారు. స్వామి దర్శనం చేసుకొని గురువారం సాయంత్రం కారులో తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. శుక్రవారం తెల్లవారుజామున 2.30గంటల ప్రాంతంలో నల్లగట్ల వద్ద డ్రైవింగ్ చేస్తున్న శివసాయి కులకర్ణి నిద్రమత్తులో కునుకు తీయడంతో వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటుకుని మరో రూట్లో హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో గుండేరావు, శ్రావణ్, నరసింహులు, సిద్ధయ్య అక్కడికక్కడే మరణించారు. సిద్ధార్థ కులకర్ణి, శివసాయి కులకర్ణి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాలను కారు నుంచి బయటకు తీశారు. క్షతగాత్రులిద్దరిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అక్కడ పరిస్థితి విషమించి సిద్ధార్థ కులకర్ణి మృతి చెందాడు. ఘటనాస్థలంలో చనిపోయిన నలుగురిని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడే పోస్టుమార్టం పూర్తి చేశారు. విషయం తెలుసుకున్న మృతుల బంధువులు ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు.ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో 40 మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళుతున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సులో 40మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రమాదంలో వీరెవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు బస్సును పోలీసు స్టేషన్‌కు తరలించి ప్రయాణికులను ఇతర వాహనాల్లో వారి గమ్యస్థానాలకు చేర్చారు.ప్రైవేటు బస్సే మృత్యుశకటమైగుంటూరు రూరల్: వెనుక నుంచి వచ్చిన ప్రైవేటు బస్సు కారును బలంగా ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం, మామిళ్ళమడవ గ్రామానికి చెందిన కంచనపల్లి మధు స్థానికంగా వంటమేస్త్రీ. ఆయనకు భార్య మనీష, పిల్లలు జ్ఞానేశ్వర్, వర్షిత్ ఉన్నారు. పిల్లలిద్దరికీ పుట్టు వెంట్రుకలు తీయించేందుకు తిరుమల వెళ్లాలని కారు మాట్లాడుకున్నారు. కారులో మధు భార్యాబిడ్డలతోపాటు తల్లిదండ్రులు కంచనపల్లి సుశీల(64) వెంకటయ్య(70) మనీష తండ్రి మన్సూర్, కారు డ్రైవర్ సైదులు(28) మంగళవారం సాయంత్రం ఇంటివద్దనుంచి తిరుమల వెళ్లారు. తిరుపతిలో పిల్లల కార్యక్రమాలు పూర్తి చేసుకుని గురువారం సాయంత్రం విజయవాడకు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం సమీపంలోకి చేరింది. ఆ సమయంలో డ్రైవర్ సైదులు నిద్ర వస్తుందని కారును పక్కకు తీసి ముఖం కడుక్కుని వెళ్దామని చెప్పాడు. కారును రోడ్డుపక్కన ఆపేందుకు స్లో చేస్తుండగా వెనుకనుంచి అతి వేగంగా వస్తున్న వీఆర్‌సీఆర్ సంస్థకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కారును బలంగా ఢీకొంది. ప్రమాదంలో సుశీల, వెంకటయ్య, డ్రైవర్ సైదులు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలినవారికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి కారు డోర్లను రాడ్లతో వంచి క్షతగాత్రులను, మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను జీజీహెచ్‌కు తరలించారు. ఎస్పీ వకుల్ జిందాల్, సౌత్‌జోన్ డీఎస్పీ భానోదయ, నల్లపాడు సీఐ వంశీధర్ ఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. -
Neeta: కష్టాలే ఇంధనంగా..
నీతా గత జీవితంలోకి తొంగిచూస్తే ‘బాధలు’ ‘కష్టాలు’ తప్ప ఏమీ కనిపించనంత చీకటి. నీతా చిన్న వయసులో ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి తాగుబోతు. ఆయన పెట్టే హింస భరించలేక అమ్మమ్మ వాళ్ల ఇంటికి పారిపోయి అక్కడే ఉంది. 14 సంవత్సరాల వయసులో 22 ఏళ్ల వ్యక్తితో నీతాకు పెళ్లి జరిగింది. పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. భర్త తాగుబోతు. రకరకాలుగా హింస పెట్టేవాడు. భర్త పెట్టే బాధలు భరించలేక అతడి నుంచి వేరుపడింది. ముగ్గురు పిల్లలు తనతో పాటే ఉన్నారు. చిన్నాచితకా పనులు చేస్తూనే ఆగిపోయిన చదువును కొనసాగించింది. పిల్లలతో పాటు చదువుకుంది. ‘నీకు ఏ పనీ చేతకాదు’ అని భర్త ఎప్పుడూ తిట్టేవాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్కూటర్ నడపడం నేర్చుకుంది. ఆ తరువాత వ్యాన్, బస్ డ్రైవింగ్‌లను నేర్చుకుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ముంబయిలో 13 బస్సులకు యజమాని అయింది. ముగ్గురు పిల్లలు బాగా చదువుకుంటున్నారు. కుమారుడు కెనడాలో ఉంటున్నాడు. స్టోరీ టెల్లింగ్ ప్లాట్‌ఫామ్ ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ నీతా స్టోరీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆన్లైన్లో ఈ ఇన్స్పైరింగ్ స్టోరీ వైరల్‌గా మారింది. ‘నేను ఎన్నోసార్లు నీతా ట్రావెల్ బస్సులలో ప్రయాణం చేశాను. ఆమె వెనుక ఇన్ని కష్టాలు ఉన్నాయని తెలియదు. ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిని ఇచ్చే స్టోరీ ఇది’ అని ఇన్స్టాగ్రామ్ యూజర్ ఒకరు స్పందించారు. -
బస్సుపై పోర్న్ స్టార్స్ ఫొటోలు.. ఫుల్ గిరాకీ!
త్రివేండ్రం: కస్టమర్స్‌ను ఆకర్షించడానికి వచ్చిన ఎలాంటి అవకాశాన్ని వదులుకోవట్లేదు వ్యాపారస్థులు. ఇటీవల రూపాయి పతనాన్ని కూడా తమ బ్రాండ్ ప్రచారానికి ఉపయోగించుకుంది డ్యూరెక్స్ ఇండియా కండోమ్ కంపెనీ. ఈ యాడ్ సోషల్ మీడియాలో తెగవైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ తరహాలోనే కేరళకు చెందిన ఓ ట్రావెల్ కంపెనీ వినూత్నంగా ఆలోచించి కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఏకంగా బస్సుపై పోర్న్స్టార్ల చిత్రాలను పెట్టేసింది. త్రివేండ్రంకు చెందిన చీకూస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ.. సంస్థకు చెందిన అన్ని బస్సులపైనా సన్నీ లియోన్, మియా ఖలీఫా, కీరన్ లీ వంటి పోర్న్స్టార్ల ఫొటోలను అతికించింది. అంతే, ఒక్కసారిగా వారి బస్సులకు డిమాండ్ పెరిగిపోయింది. పోర్న్ స్టార్ల ఫొటోలతో అందంగా ముస్తాబై రోడ్డుపై వెళ్తున్న బస్సులను చూసేందుకు కూడా జనాలు ఎగబడుతున్నారట. కేరళకే చెందిన ఓ వ్యక్తి ఈ బస్సుల ఫొటోలు తీసి ‘కేరళలోని బస్సులు.. సీరియస్‌గా తీసుకోవద్దు’ అని ట్విటర్లో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి. అయితే ఈ పోస్ట్‌కు పోర్న్ స్టార్ కీరన్ లీ స్పందిస్తూ ‘ఆకట్టుకునేలా’ ఉందనడం ఇక్కడ విశేషం. Impressive — Keiran Lee (@KeiranLee) 30 June 2018 చదవండి: రూపాయి పతనం.. కండోమ్ యాడ్ వైరల్ -
ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ దాడులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 60 బస్సులపై కేసులు నమోదు చేశారు. గద్వాల జిల్లా అలంపూర్ వద్ద జరిపిన తనిఖీల్లో సరైన ప్రమాణాలు పాటించని 30 బస్సులపై, హైదరాబాద్ శివార్లలో మరో 30 బస్సులపై అధికారులు కేసులు నమోదయ్యాయి. -
10 ప్రైవేట్ బస్సులు సీజ్
హైదరాబాద్: అనుమతి లేకుండా అక్రమంగా ప్రయాణికులను చేరవేస్తున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన 10 ప్రైవేటు బస్సులను సోమవారం ఉదయం సీజ్ చేశారు, మరో పది బస్సులపై కేసులు నమోదుచేశారు. హయాత్‌నగర్ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై అక్రమంగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స బస్సులపై ఉప్పల్ ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. -
21 ట్రావెల్స్ బస్సులపై కేసులు
ఎల్బీనగర్: రవాణా శాఖ అధికారులు మరోసారి ప్రైవేటు బస్సులపై కొరడా ఝుళిపించారు. ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు సమీపంలో బుధవారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 21 బస్సులను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. -
ఆగిన ‘ట్రావెల్స్’ బస్సులు
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ : ఆర్టీఏ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ట్రావెల్స్ బస్సులను విస్తృతంగా తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని సీజ్ చేస్తుండడంతో జిల్లాలో దాదాపు 70 సర్వీసులు నిలిచిపోయినట్టు తెలిసింది. టూరిస్ట్ అనుమతి ముసుగులో స్టేజి క్యారియర్లగా హైదరాబాద్‌కు బస్సులను నడుపుతూ, వాహన చట్టాన్ని అతిక్రమిస్తున్నందున ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తూ.. బస్సులను సీజ్ చేస్తున్న పరిణామాలు వాటి యాజమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అమలాపురం నుంచి రోజూ హైదరాబాద్‌కు వెళ్లే 25 బస్సులను సోమవారం నిలిపేశారు. ముందే బుక్ చేసుకున్న ప్రయాణికులకు బస్సులను నిలిపివేసిన సమాచారాన్ని ఫోన్లు చేసి చెబుతున్నారు. ఈ రోజు బస్సు అనివార్య కారణాల వల్ల హైదరాబాద్‌కు వెళ్లడం లేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రయాణికులను అభ్యర్థిస్తున్నారు. దీంతో ప్రయాణికులు చేసేది లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. ఆర్టీసీని నష్టాల నుంచి బయటకు తెచ్చేందుకు, పాలెం సంఘటన నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేట్ బస్సులను అదుపు చేసేందుకు కఠినంగా వ్యవహరిస్తుండడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు విలవిల్లాడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా నిత్యం హైదరాబాద్‌కు ట్రావెల్స్ బస్సులు దాదాపు 110 ప్రయాణిస్తుంటాయి. ఇవన్నీ టూరిస్ట్ అనుమతితో ఒకచోట నుంచి మరో చోటకు నేరుగా ప్రయాణికులను తీసుకెళ్లే పద ్ధతిలో పన్ను చెల్లిస్తారు. అయితే స్టేజి కేరియర్లుగా నాలుగైదు చోట్ల ప్రయాణికులను ఎక్కించుకుని, ఆర్టీసీలా సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా నుంచి ప్రయాణించే వాటిలో సోమవారం దాదాపు 70 బస్సులను నిలిపేశారు. సంక్రాంతి పండగల సీజన్‌తో ప్రైవేట్ హైటెక్ బస్సులన్నీ టికెట్‌కు అధిక ధర వసూలు చేసి, నిబంధలనకు విరుద్ధంగా నడుపుతారని ఆర్టీఏ అధికారులు నిఘా పెట్టడంతో, ఈ సమాచారాన్ని ముందే పసిగట్టిన ట్రావెల్స్ యాజమానులు బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. జిల్లాకు చెందిన మరికొన్ని బస్సులను మార్గమధ్యంలోనే నిలిపివేస్తున్నారు. హైదరాబాద్ నుంచి జిల్లాకు రావాల్సిన కొన్ని బస్సులను కూడా అక్కడే నిలిపేశారు. ఒకటి అరా ట్రావెల్స్ సంస్థలు మాత్రం తమ బస్సులను ధైర్యం చేసి వేరే మార్గాల్లో నడిపేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. -
ఆర్టీఏ తనిఖీలు: 12 బస్సులు సీజ్
శంషాబాద్, న్యూస్‌లైన్: ఇటీవల వోల్వో బస్సుల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం గగన్‌పహాడ్ చౌరస్తా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను నిలిపి తనిఖీలు చేశారు. మొత్తం పన్నెండు బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. బస్సుల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారని, కొన్ని బస్సుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఒకే డ్రైవర్ ఉండడంతో సీజ్ చేశారు. అధికారులు వాహనాలను సీజ్ చేయడంతో బస్సుల్లో ఉన్న కొందరు ప్రయాణికులు వారితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తనిఖీలతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వారు వాపోయారు.


