నల్లగుట్ట.. గుట్టుగా కబ్జా | - | Sakshi
Sakshi News home page

నల్లగుట్ట.. గుట్టుగా కబ్జా

Sep 20 2026 6:36 AM | Updated on Sep 20 2026 6:36 AM

ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నం

ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్న కూటమి నేతలు

అధికార పీఠం ఎక్కినప్పటి నుంచి కూటమి నాయకులు ‘కాదేదీ కబ్జాకు అనర్హం’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనే చందంగా.. కనిపించిన ప్రభుత్వ భూమినల్లా ఆక్రమించేందుకు యత్నిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారు. ఇప్పటికై నా వారి అరాచకాలకు అధికారులు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

గాలివీడు : మండల పరిధిలోని గోరాన్‌చెరువు గ్రామం షికారి కాలనీ వద్ద నల్లగుట్టలో 1465బీ 34 సెంట్ల ప్రభుత్వ తోపు భూమిని యంత్రాల సాయంతో దండుకోవడమే కూటమి నాయకుల అజెండాగా మారుతోంది. గత ప్రభుత్వాల హయాం నుంచి ఆ భూమిని గ్రామ పెద్దలు, రెవెన్యూ అధికారులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. గ్రామ భావితరాల కోసం ప్రభుత్వ భవనాలు నిర్మించేందుకు అనువుగా ఉంటుందని నిలపడం జరిగింది. అయితే ఈ భూమిపై కూటమి నాయకుల కనున్న పడింది. అలాగే ఆ గ్రామంలోని విలువైన ప్రభుత్వ భూములను కూడా వారు ఆక్రమించే పనిలో నిమగ్నమయ్యారు.

రాత్రిపూట పనులు

ఈ నెల, 13, 14 తేదీల్లో ఆదివారం, వినాయక చవితి సెలవులు రావడంతో.. ఇదే అదునుగా నల్లగుట్టను చదును చేయడం ప్రారంభించారు. తర్వాత సెలవులు ముగియడంతో..రాత్రిపూట పనులు చేస్తున్నారు. అధికారం తమదే, ఎవరు అడ్డు వచ్చేదంటూ ఏకంగా యంత్రాలతో చదును చేస్తున్నారు. అక్కడ ప్రశ్నించే వారిని కూడా బెదిరిస్తున్నారు. ఈ విషయంపై వెంటనే స్పందించి ఈ భూమి వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి స్వాధీనం పరుచుకోవాలని కొమ్మరపల్లె ప్రజలు మండల రెవెన్యూ అధికారులను కోరుతున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే ఈ భూమిని రక్షించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement