సాక్షి, మదనపల్లె: మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ఈనెల 23, 24తో ముగుస్తుంది. దీంతో వీటికి ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం శనివారం రెండు వేర్వేరు జీవోలను జారీ చేసింది. ఇందులో మండల పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు పదవీకాలం ఈనెల 23తో ముగుస్తుంది. దీనికి సంబంధించి పాలనాపరమైన ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం మండల స్థాయి ప్రత్యేక అధికారులను నియమించేందుకు కలెక్టర్లకు అధికారం కల్పిస్తూ జీవో జారీ చేసింది. మండల ప్రత్యేక అధికారుల నియామక విషయంలో ఎంపీడీవో కంటే ఒక హోదా పైస్థాయి కలిగిన అధికారిని మాత్రమే నియమించాల్సి ఉంటుందని జీవోలో స్పష్టం చేశారు. ప్రత్యేక అధికారులుగా డివిజనల్ స్థాయి అధికారులు, ఇంజినీర్లను నియమించరాదని సూచించారు. మండల స్థాయి ప్రత్యేక అధికారుల పాలన ఈనెల 24 నుంచి మొదలవుతుందని, వీరి పదవీకాలం ఆరు నెలలు లేదా మండల పరిషత్ పాలకవర్గం ఏర్పడి బాధ్యతలు చేపట్టే తేదీ వరకు ఉంటుందని జీవోలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని 25 మండలాలకు ఈనెల 24 నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి రానుంది.
జెడ్పీకి కలెక్టర్
జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవీకాలం ఈనెల 24తో ముగుస్తుంది. పాలకవర్గం స్థానంలో జిల్లా కలెక్టర్‌ను జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం మరో జీవోను జారీ చేసింది. అయితే ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో నాలుగు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్నాయి. జిల్లా పరిషత్ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాగా కొనసాగుతోంది. దీంతో ప్రత్యేక అధికారి చిత్తూరు కలెక్టర్ ఉంటారా లేక అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఈ జిల్లాకు ప్రత్యేక అధికారిగా ఉంటారా అనేది స్పష్టత లేదు.
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం


