రాయచోటి: ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా సకాలంలో అందేలా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. రాయచోటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలు, రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజల సంఖ్య, ఆరోజు పూర్తయిన రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్ వివరాలను సబ్ రిజిస్ట్రార్‌ను అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. శ్లాబ్ బుక్ చేసుకొని కార్యాలయం వద్ద వేచి ఉన్న ప్రజలను జిల్లా కలెక్టర్ స్వయంగా కలిసి, వారి శ్లాబ్ సమయాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, కార్యాలయంలో అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలో వివిధ రికార్డులను పరిశీలించారు. కార్యాలయ నిర్వహణ, రికార్డుల భద్రత, ప్రజలకు అందించే సేవల విషయంలో నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సబ్‌రిజిస్ట్రార్, రిజిస్ట్రేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చెత్త నిర్వహణపై ఆరా
రామాపురం: మండలంలోని కుమ్మరపల్లె గ్రామపంచాయతీ పరిధిలో జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ శనివారం పర్యటించారు.స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.గ్రామంలో చెత్త సేకరణ,తరలింపు తడి–పొడి వ్యర్థాల వేరు చేయడం వర్మీ కంపోస్ట్ ప్రక్రియపై అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. గ్రామంలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా చూడాలన్నారు. అనంతరం కుమ్మరపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు.పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి ఆంగ్లం,గణితం పలు అంశాల్లో వారి అవగాహనను పరీక్షించారు. పాఠశాలలోని డిజిటల్ బోర్డు వినియోగాన్ని పరిశీలించిన కలెక్టర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా ఉపయోగించి విద్యార్థుల అభ్యసన సామార్థ్యాలను పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం స్వర్ణాంధ్ర–స్వఛ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలసి మానవహారంగా ఏర్పడి స్వఛ్చత ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జాషువా,తాసీల్దార్ వెంకటేశ్వర్లు,మండల స్థాయి అధికారులు,ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్


