● జిల్లాలో 39,139 వేల దరఖాస్తులు
● 35 వేలకు పైగా పెండింగ్
● అర్హులకు న్యాయం జరిగేనా!
● దరఖాస్తుదారుల్లో ఆందోళన
మదనపల్లె (కురబలకోట): చంద్రబాబు చెప్పేది ఒకటి..చేసేది మరొకటి అని తెలిసిందే. ఆయన చెప్పింది చేయడం చాలా తక్కువ. ఫించన్ల వ్యవహారంలో కూడా మంజూరు అయ్యే వరకు ఎవ్వరికి మంజూరవుతుందో..ఎవ్వరికి కాదో చెప్పడం కష్టతరమని చెబుతున్నారు. పింఛన్ ధరఖాస్తుల నమోదు శుక్రవారంతో ముగియడంతో వారంలో వెరిఫికేషన్ పూర్తి చేయనున్నారు. వేలాది మంది కొత్త పింఛన్ వస్తుందన్న ఆశతో వ్యయప్రయాసలకు ఓర్చి దరఖాస్తు చేశారు. అన్నమయ్య జిల్లాలో 39,139 మంది దరఖాస్తులు నమోదైనట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లుగా ఒక్క కొత్త ఫించన్ ఇచ్చిన పాపానపోలేదు. హడావుడిగా దరఖాస్తుల కార్యక్రమం జరిగింది. శుక్రవారం సాయంత్రం వరకు పింఛన్ల దరఖాస్తులు నమోదు చేశారు. వీటిలో ఇప్పటి వరకు 3447 మాత్రమే ఆమోదం లభించగా 35,462 దరఖాస్తులు పరిశీలనలో దశలోనే ఉన్నాయి. మరో 230 తిరస్కరణకు గురయ్యాయి. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తుల ఆమోదం 8.81 శాతంగా నమోదైంది. దీన్ని బట్టి వేలల్లో దరఖాస్తులు.. వందల్లో ఆమోదాలు సాగుతున్నాయన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
నిబంధన పేరుతో ఎవరికి ఎసరో..
ఏ నిబంధన పేరుతో ఎవరికి ఫించన్ మంజూరు చేస్తారో..ఎవరిని పక్కన పెడతారో అని దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక నిబంధనలు విధించింది. ముఖ్యంగా ఇంటిపన్ను రశీదు, కరెంటు బిల్లు, ఓటరు ఐడీ కార్డు జిరాక్స్‌లను జత చేయాలని పేర్కొంది. తర్వాత పత్రాలు లేకపోయినా ఐడీ నంబర్లు ఉన్నా సరిపోతుందని సవరించడంతో కొంత ఊరట లభించింది. పింఛన్లకు సంబంధించి వివిధ పత్రాల కోసం ఆధార్, మీసేవ, జీరాక్స్ సెంటర్లు కిటకిటలాడాయి. 50 ఏళ్ల వయోపరిమితి ఉండాలని చెప్పడంతో ఒంటరి మహిళల పరిస్థితి గందరగోళంగా మారింది. హౌస్ మ్యాపింగ్ తొలగించకపోవడంతో అర్హులు ఉన్నా దరఖాస్తు చేసుకోలేకపోయారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు తదితర అర్హులైన వారు పింఛన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. దరఖాస్తుల ఆన్‌లైన్ నమోదు ముగియడంతో జిల్లాలోని 430 గ్రామ, వార్డు సచివాలయాల్లో వెరిఫికేషన్ కొనసాగుతున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. వయసు మీదపడి అడుగు ముందుకు వేయలేని అవ్వాతాతలు, జీవిత భాగస్వామిని కోల్పోయి ఒంటరిగా బతుకు బండి లాగుతున్న వితంతువులు, శారీరక వైకల్యాన్ని అధిగమిస్తూ జీవనం సాగిస్తున్న దివ్యాంగులతో పాటు ఇతర పింఛన్లు ఆశిస్తున్న వారు జీవితానికి ఆసరాగా నిలుస్తుందని దరఖాస్తు చేసుకున్నారు. అధికారుల పరిశీలనలో ఎవరికి వస్తుందో..ఎవరికి రాదో..అన్న టెన్షన్ నెలకొంది.


