● ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు..
● వైఎస్సార్‌సీపీ నేతలు ఆకేపాటి
అమరనాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి
రాయచోటి: అన్నమయ్య జిల్లాను కరువు రక్కసి కమ్మేసినా, కంటిముందు పంటలు ఎండిపోతూ రైతులు విలవిలలాడిపోతున్నా ఈ కూటమి ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లైనా లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాయచోటిలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డితో కలసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంత రైతులకు చేయాల్సిన న్యాయాన్ని మరిచి, కేవలం వ్యక్తిగత విమర్శలతో కూటమి నేతలు కాలాన్ని వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తాము గర్వంగా చెప్పుకుంటామని, కానీ నేటి పాలకులు కరువును పట్టించుకోకుండా రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
5 శాతం కూడా సాగు కాలేదు!
గడిచిన 10 నుంచి 15 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర వర్షాభావ పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు వస్తున్నా, జిల్లాలో నేటికీ కనీసం 5 శాతం పంటలు కూడా సాగు కాకపోవడం రైతుల దీనస్థితికి అద్దం పడుతోందన్నారు. జిల్లాలో అత్యధికంగా లోటు వర్షపాతం నమోదైందన్నారు.
● జిల్లాలో ప్రస్తుతం పశువులకు కనీసం గడ్డి దొరికే పరిస్థితి లేదన్నారు. పశుగ్రాసం కొనాలంటే వేలాది రూపాయలు పెట్టాల్సి వస్తోందన్నారు. పెంచుకున్న జీవాల ఆకలి బాధలు చూడలేక రైతులు అప్పులు చేసి మరీ గడ్డి కొంటున్నారని, వారి కష్టాలు చూస్తే గుండె తరుక్కుపోతోందన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ పాల ధర అనుకూలంగా లేకపోవడం దారుణమన్నారు. గతంలో పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక, ముఖ్యంగా మామిడి రైతులు కాయలు అమ్ముకోలేక రోడ్లపై పారేసిన పరిస్థితులు ఉన్నాయన్నారు.
చంద్రబాబు, కరువు..
కవల పిల్లలు: ఎమ్మెల్యే ఆకేపాటి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ.. ‘కరువు, చంద్రబాబు కవల పిల్లల’ని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమం, రైతుల సమస్యలపై తగిన రీతిలో దృష్టి సారించలేదని విమర్శించారు. రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా తగ్గిందని, సెప్టెంబర్ నాటికి జిల్లాలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే 70.5 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారిక గణాంకాలే చెబుతున్నాయన్నారు. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ ముందస్తు ప్రణాళిక ఉండదని, రాజు సరిగ్గా లేకపోతే ఇలాగే కరువు పరిస్థితులు దాపురిస్తాయని విమర్శించారు. ఈ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను కూడా నిలిపేసిందని మండిపడ్డారు.
వెలిగల్లు లేకపోతే రాయచోటికి తాగునీరేది?
ఇలాంటి కరవు పరిస్థితులు వస్తాయని ముందే గ్రహించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టులను ఒక రూపునకు తెచ్చారని శ్రీకాంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఈరోజు కొద్దో గొప్పో ఆ గేట్లకు మరమత్తులు చేసి, మొత్తం ప్రాజెక్టులను నేనే చేశానని చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. రాయచోటి, ఇతర ప్రాంతాలకు తాగునీటి ఇబ్బంది రాకూడదని 4.5 టీఎంసీల సామర్థ్యంతో వెలిగల్లు ప్రాజెక్ట్ ను వైఎస్సార్ అందించారని, అది లేకపోతే ఈరోజు రాయచోటి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీంతో పాటు శ్రీనివాసపురం రిజర్వాయర్, జరికోన ప్రాజెక్టులు వైఎస్సార్ హయాంలోనే రూపుదాల్చాయని, తర్వాత వైఎస్ జగన్ హయాంలో ఈ ప్రాజెక్టులు మరింత ముందుకు సాగాయన్నారు. గండికోట నుంచి టేకాప్ చేసి ఆవులపల్లి, మదనపల్లె ఏరియాలో మూడు అదనపు రిజర్వాయర్లు నిర్మించాలని వైఎస్ జగన్ సంకల్పిస్తే నాడు హేళన చేశారని, ఈరోజు ఆ రిజర్వాయర్లు ఉండి ఉంటే ఈ ప్రాంతానికి ఎంత మేలు జరిగేదో ఆలోచించాలన్నారు.
● ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ వస్తున్నా రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువుల సరఫరాపై ఈ ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేదని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సున్నా వడ్డీకే రుణాలు ఇస్తూ, పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించి, సీజన్ ముగిసేలోపే ఇన్‌పుట్ సబ్సిడీ ద్వారా రూ.10 వేల కోట్లకు పైగా పరిహారం అందించి ఆదుకుందని గుర్తుచేశారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించకపోగా, రుణాలు రీషెడ్యూల్ చేయలేదని, బీమా ప్రీమియం కూడా చెల్లించలేదని దుయ్యబట్టారు. రైతుల సమస్యలను పక్కనబెట్టి, తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తూ దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగారని కూటమి నేతలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రౌడీల పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు.
వైఎస్సార్‌సీపీ డిమాండ్లు
అన్నమయ్య జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలి.వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల నష్టపరిహారం తక్షణమే చెల్లించాలి.ఎండిపోతున్న మామిడి, చీనీ ఉద్యాన తోటలను కాపాడేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి, ప్రభుత్వమే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలి.రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని, ప్రభుత్వాన్ని లొంగదీసైనా సరే అన్నదాతకు న్యాయం జరిగేలా చూస్తామని నేతలు స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి షబ్బీర్, మాదిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, అన్నా సలీం, మాజీ సర్పంచ్ గోపిరెడ్డి, మోక్షిత్, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు నరేష్ స్వామి, సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.


