● కొప్పర్తి పారిశ్రామికవాడను
కడప బైపాస్కు కలుపుతూ కొత్త హైవే
● రూ.304 కోట్ల నిధులు మంజూరు చేసిన కేంద్రం
● కడప నగరంలో తగ్గనున్న ట్రాఫిక్ రద్దీ
కడప సిటీ : కడప నగర శివార్లలోని కొప్పర్తి పారిశ్రామికవాడకు మంచిరోజులు వచ్చాయి. కొప్పర్తి పారిశ్రామికవాడ– కడప బైపాస్‌ను కలుపుతూ నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రూ. 304 కోట్ల నిధులు మంజూరు చేసింది. గతి శక్తి’ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే భూ సేకరణ పనుల్లో నేషనల్ హైవే అధికారులు నిమగ్నమయ్యారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే పారిశ్రామిక అభివృద్ధితో పాటు కడప నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.
5.8 కి.మీ. మేర హైవే
ఈ ప్రాజెక్టులో భాగంగా 5.8 కిలోమీటర్ల పొడవున ఈ నిర్మాణానికి రూ.304.44 కోట్లు ఖర్చు చేయనున్నారు. రోడ్డు పొడవునా యాక్సెస్ కంట్రోల్ హైవేను నిర్మించనున్నారు. రెండు భారీ వంతెనలు, నాలుగు వెహిక్యులర్ అండర్ పాసులతో పాటు ప్రస్తుతమున్న కడప బైపాస్‌ను కూడా పటిష్టమైన సోల్డర్తో అభివృద్ధి పరచనున్నారు. ఈ పనుల వల్ల కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతానికి రవాణా సౌకర్యాలు మెరుగు పడడంతోపాటు వాహన రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
విశాఖ–చైన్నెలకు అనుసంధానం
విశాఖపట్టణం–చైన్నె పారిశ్రామిక కారిడార్‌లో అనుసంధానతను బలోపేతం చేయడంలో ఈ రహదారి కీలకపాత్ర వహించనుంది. అంతేకాకుండా కడప నగరంలో ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ రోడ్డు నిర్మాణం వల్ల ప్రాజెక్టు ప్రాంతీయ, ఆర్థికాభివృద్దికి దోహదపడుతుంది. కొప్పర్తి పారిశ్రామికవాడ శరవేగంగా అభివృద్ధి చెందేందుకు ఈ కొత్త రహదారి మైలురాయిగా నిలుస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


