● చాలీచాలని వేతనాలు
● ఉద్యోగభద్రత కరువు
మదనపల్లె (కురబలకోట) : గ్రామాల్లో నోరులేని మూగజీవాలకు అర్ధరాత్రి అత్యవసర పరిస్థితి వచ్చినా, ఆవులు గర్భధారణకు వచ్చినా రైతులకు ముందుగా గుర్తొచ్చేది ‘గోపాలమిత్ర’లే. ఎండనక, వాననక పల్లె పల్లెనా తిరుగుతూ కొండంత అండగా నిలుస్తున్న ఈ పశువైద్య సహాయకుల బతుకులు మాత్రం చాలీచాలని వేతనాలతో అగమ్యగోచరంగా మారాయి. ఫోన్ చేయగానే సొంత మోటార్ సైకిల్‌పై రైతుల ఇళ్ల వద్దకు వాలిపోయే వీరికి ఏళ్లుగా సేవ చేస్తున్నా కనీస గుర్తింపు కానీ, ఆశించిన వేతనం కానీ లభించడం లేదు. నెలకు కేవలం రూ.6,500తో కుటుంబాలను పోషించలేక, ఇటు వృత్తిని వదలలేక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. తమకు కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
పెరిగిన ధరలు.. అగమ్యగోచరంగా బతుకులు
రవాణా సౌకర్యాలు లేని మారుమూల పల్లెల్లో సైతం వ్యవసాయ పొలాలు, రైతుల ఇండ్ల వద్దకే వెళ్లి మండల పశువైద్యాధికారి పర్యవేక్షణలో గోపాలమిత్రలు నిరంతర సేవలు అందిస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా శ్రమిస్తున్నా.. వీరి వేతనం మాత్రం గొర్రె తోక బెత్తెడు చందంగానే ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, వైద్య ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్నా.. జీతాల్లో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. ఎలాంటి టీఏ, డీఏలు లేకుండా సొంత ఖర్చులతోనే ప్రయాణాలు సాగిస్తున్నారు. సచివాలయాలలో పనిచేసే యానిమల్ హస్బెండ్రీ అసిస్టెంట్లు (AHA) నిర్వర్తించే వ్యాక్సినేషన్, ఏఈ, పీపీఆర్, ఈటీ, బ్లూటంగ్, అంత్రాక్స్, షీప్ ఫాక్స్, హెచ్‌సీ, బిక్యూ వ్యాక్సిన్లు వంటి అన్ని రకాల విధులను గోపాలమిత్రలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే, వీరి కంటే వెనుక వచ్చిన ఏహెచ్ఎలకు నెలకు దాదాపు రూ.30 వేల దాకా వేతనం ఇస్తుండగా, ఏళ్లుగా సేవ చేస్తున్న గోపాలమిత్రలను మాత్రం రూ.6,500 కే పరిమితం చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.
తెలంగాణతో పోలిస్తే అన్యాయం
పక్క రాష్ట్రమైన తెలంగాణలో అక్కడి గోపాలమిత్రల వేతనాన్ని మొదట రూ.8,500కు పెంచి, ప్రస్తుతం పీఆర్సీతో కలిపి రూ.11,050 అందజేస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఏళ్లు గడుస్తున్నా కనీస వేతనానికి దిక్కులేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో గోపాలమిత్రల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి గౌరవ వేతనాన్ని పెంచాలని కోరుతున్నారు.
ప్రధాన డిమాండ్లు
జీతాల పెంపు : ప్రస్తుతమున్న రూ.6,500 వేతనాన్ని తక్షణమే పెంచి గౌరవప్రదమైన కనీస వేతనం అందించాలి.
ఉద్యోగ భద్రత : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 2200 మంది గోపాలమిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
సామాజిక భద్రత : విధి నిర్వహణలో ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్నందున ఉచిత బీమా, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు అమలు చేయాలి.
తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 126 మంది గోపాలమిత్రలం పనిచేస్తున్నాం. రేయింబవళ్లు కష్టపడుతున్నా ఆశించిన వేతనం రావడం లేదు. ఆ వచ్చే అరకొర జీతం కూడా ప్రతి నెలా సక్రమంగా అందకపోవడంతో కుటుంబం ఎలా గడవాలో అర్థం కావడం లేదు. ప్రయాణ సమయంలో ప్రమాదాల బారిన పడినా ఎలాంటి భద్రత లేదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మమ్మల్ని గుర్తించి, ఆదుకోవాలి.
– ఎన్.రెడ్డి శేఖర్, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, గోపాలమిత్రల అసోసియేషన్


