సాక్షి, మదనపల్లె : జిల్లా కేంద్రం మదనపల్లె ప్రజలకు తాగునీటిని అందించే మకుటం లాంటి పథకం ఈ నీటిశుద్ధీకరణ ప్లాంట్. మున్సిపల్, ప్రజారోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా దుండగుల పాలిట కామధేనువుగా మారింది. వైఎస్సార్ హయాంలో చిప్పిలిగుట్టపై కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రతిష్టాత్మక నీటి శుద్ధీకరణ ప్లాంట్ ప్రారంభోత్సవానికి నోచుకోకముందే పూర్తిగా విధ్వంసానికి గురైంది. 2009లోనే పనులు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నప్పటికీ, కనెక్టివిటీ పైప్‌లైన్ పనులు పెండింగ్‌లో పడటంతో ప్లాంట్ నిరుపయోగంగా మారింది. పర్యవేక్షణ లోపించడంతో అసాంఘిక శక్తులు ప్లాంటుపై పడి గోడలు పగలగొట్టడం, కిటికీలు, తలుపులు, ఇనుప షట్టర్లు, అత్యంత విలువైన శుద్ధీకరణ పరికరాలను దొంగిలించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఇదీ అసలు లక్ష్యం..
చిప్పిలి వద్ద నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులోకి హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను నింపడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. అక్కడి నుంచి గుట్టపై ఉన్న నీటి శుద్ధీకరణ ప్లాంటు వరకు పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించాలి. ప్లాంటులో శుద్ధి చేసిన స్వచ్ఛమైన తాగునీటిని మరో పైప్‌లైన్ ద్వారా మున్సిపాలిటీకి చెందిన తాగునీటి పథకాలకు అందించి, అక్కడి నుంచి పట్టణ ప్రజలకు సరఫరా చేయాలనేది అసలు ప్రణాళిక.
అప్పట్లో సర్వం సిద్ధం..
ఈ బృహత్తర ప్రాజెక్టు కోసం చిప్పిలిగుట్టపై నీటి శుద్ధీకరణ యంత్రాలు, వాటి నిర్వహణ కోసం ప్రత్యేక భవనాలు, భారీ నీటి ట్యాంకులను అప్పట్లోనే నిర్మించారు. యంత్రాల అమరికతో పాటు భవనానికి అన్ని హంగులు తీర్చిదిద్ది, రక్షణ కోసం చుట్టూ పటిష్టమైన ప్రహరీ గోడను కూడా నిర్మించారు. ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైన తరుణంలో అనుసంధాన పనులు నిలిచిపోవడంతో ప్రాజెక్టు నిలిచిపోయింది.
కాపలా లేక.. కరవైన రక్షణ
కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ ప్లాంట్‌ను కాపాడటంలో మున్సిపల్, ప్రజారోగ్య శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. కనీసం ఒక్క కాపలాదారుణ్ణి (వాచ్‌మన్) కూడా నియమించకపోవడంతో ఇది దుండగులకు అడ్డాగా మారింది. ప్లాంట్‌లోని ప్రధాన పైపులను పగలగొట్టి బయట పారేశారు. యంత్రాలపై ఉన్న పటిష్టమైన ఇనుప నిర్మాణాలను, భవనం నాలుగు వైపులా ఉన్న విలువైన అల్యూమినియం కిటికీలను, తలుపులను గోడలు బద్దలు కొట్టి మరీ ఎత్తుకెళ్లారు.
గాలికి వదిలేసిన అధికారులు..
ప్రధాన ప్లాంట్ ముఖద్వారం వద్ద ఉన్న భారీ ఇనుప షట్టర్‌ను సైతం ముక్కలు చేసి తరలించుకుపోయారు. ప్లాంట్‌కు ఆనుకుని నిర్మించిన ఒక గదిని పూర్తిగా నేలమట్టం చేశారు. ప్రారంభానికి ముందే లక్షలాది రూపాయల ప్రజాధనం లూటీ అవుతున్నా మున్సిపల్, ప్రజారోగ్య శాఖ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ప్లాంట్ రక్షణకు చర్యలు చేపట్టాలని, విధ్వంసానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మదనపల్లె ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
చిప్పిలిగుట్టపై నీటి శుద్ధీకరణ ప్లాంట్ నిర్మాణం
మదనపల్లెకు ఇక్కడినుంచి తాగునీటి సరఫరా
అప్పట్లోనే ప్రారంభోత్సవానికి సిద్ధం
ఇప్పుడు ప్లాంటులో ఇనుప పరికరాల చోరీ
గోడలు పగలగొట్టి తలుపులు, కిటికీలు తస్కరణ


