మదనపల్లె టౌన్ : ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. మంగళవారం రాత్రి గుర్రంకొండ వద్ద చోటు చేసుకున్న ఘటనపై ఎస్‌ఐ రవీంద్ర తెలిపిన వివరాలు.. చిన్నమండెం మండలం పడమటకొనకు చెందిన సురేష్ కుమారుడు రామ్మూర్తి నాయుడు(24), బైకుపై గుర్రంకొండకు వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలోని గుర్రంకొండ దవలప్‌కాన్‌పల్లె వద్ద ఆగిపోయిన లారీని ఢీ కొట్టి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళాడు. స్థానికులు గమనించి బాధితున్ని వెంటనే మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
గ్యాస్ సిలిండర్లు మీద పడి..
మదనపల్లె టౌన్: టెంపోలో ఉన్న గ్యాస్ సిలిండర్‌లను కిందకు దింపే క్రమంలో అవి మీదపడి ఓ డెలివరీ బాయ్ తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం గుర్రంకొండలో జరిగిన ఘటనపై వివరాలు.. గుర్రంకొండ ఇండేన్ గ్యాస్‌లో పనిచేసే విజయ్‌కుమార్ కస్టమర్లకు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసే క్రమంలో టెంపోలో ఉన్న సిలిండర్లను కిందకు దించేటప్పుడు అవిమీద పడి కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మదనపల్లె టౌన్ : దొంగతనం కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ మదనపల్లె కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. పుంగనూరు మండలం, చండ్రమాకులపల్లికి చెందిన పులి వెంకటరెడ్డి(33) తండ్రి చనిపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. మదనపల్లి మండలం, కొండమారిపల్లి పంచాయతీలోని టిట్కో ఇంట్లో జరిగిన చోరీ కేసులో తాలూకా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఒక సంవత్సరం జైలు శిక్ష విధించినట్లు సీఐ కళా వెంకటరమణ మీడియాకు తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం నిందితుడిని మదనపల్లె సబ్ జైలుకు తరలించినట్లు తెలిపారు.
బావిలో పడి వృద్ధుడి మృతి
లక్కిరెడ్డిపల్లి : లక్కిరెడ్డిపల్లిలోని శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల సమీపంలో వంక బజారులో నివసిస్తున్న వెంకటయ్య(72) అనే వృద్ధుడు బావిలో పడి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. వెంకటయ్య రోజూ కూలీ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే వాడని, గత నెల 31వ తేదిన ఉదయం పనికి వెళ్లి సాయంత్రానికి ఇంటికి రాలేదని వారు పేర్కొన్నారు. ఆగస్టు 1వ తేదీన పెన్షన్ తీసుకోకపోవడంతో చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టగా కనిపించలేదని, మంగళవారం గొల్లపల్లి సమీపంలోని ఓ బావిలో పడి మృతి చెందినట్లు వివరించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకొని వెంకటయ్య మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పచెప్పారు.
మున్సిపల్ ఆర్‌ఐ తొలగింపు
ప్రొద్దుటూరు : మున్సిపాలిటీలోని రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రమేష్‌ను రెవెన్యూ విధుల నుంచి తదుపరి విచారణ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా తొలగించినట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.20 లక్షలు తీసుకుని పూజా స్కూల్ ఆస్తిని బదలాయించినట్లు ఆర్‌ఐపై ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించామని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి విచారణ అధికారిని నియమించామని తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో ఎవరు అవినీతికి పాల్పడినా తనకు గానీ, నేరుగా ఏసీబీకి ఫిర్యాదు చేయవచ్చునని వివరించారు.


