కడప అర్బన్ : కుటుంబ పోషణ కోసం వాచ్‌మెన్‌గా చేరిన ఓ వ్యక్తి విధి నిర్వహణలోనే ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన కడపలో చోటుచేసుకుంది. ఖాజీపేట మండలం మిడుతూరు దళితవాడకు చెందిన గుండుగాళ్ల బాలుడు(40) కొద్ది కాలంగా కడపలో అరవింద్ నగర్‌లోని దుర్గా విల్లాస్ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. నెల రోజుల క్రితమే అక్కడ ఉద్యోగంలో చేరిన ఆయన, మంగళవారం అపార్ట్‌మెంట్‌లోని నీటి ట్యాంకును శుభ్రం చేసేందుకు పైకి ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య గంగాదేవి, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబానికి ఏకై క ఆధారంగా ఉన్న బాలుడు ఆకస్మికంగా మృతి చెందడంతో భార్య, చిన్నారులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబ పోషణ కోసం ఇంటి నుంచి దూరంగా వచ్చి ఉద్యోగంలో చేరిన నెల రోజుల్లోనే ఆయన మృత్యువాత పడడం అందరినీ కలచి వేసింది. సమాచారం అందుకున్న చిన్న చౌక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


