విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మార్ట్ దగ్ధం
గాలివీడు : మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న వనిత మార్ట్ సూపర్ మార్కెట్‌లో ఆదివారం సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దుకాణంలో ఉన్న లక్షల రూపాయల విలువైన వ్యాపార సామగ్రి పూర్తిగా దగ్ధమై బూడిదగా మారింది. స్థానికుల కథనం మేరకు బలిజపల్లి గ్రామానికి చెందిన తంగాల గంగాధర్ యాజమాన్యంలోని వనిత సూపర్ మార్కెట్ ఆదివారం సెలవు కావడంతో మూతవేసి ఉంది. సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ఒక్కసారిగా దుకాణం నుంచి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన చుట్టుపక్కల దుకాణదారులు మంటలను ఆర్పేందుకు విఫలయత్నం చేసి చివరకు మంటలను అదుపులోకి తెచ్చారు. వెంటనే పోలీసులకు సమాచా రం అందించడంతో గాలివీడు ఎస్‌ఐ జె. నరసింహారెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ యంత్రం సహాయంతో షట్టర్లు తొలగించారు. అప్పటికే దుకాణం లోపల ఉన్న సరుకులన్నీ పూర్తిగా కాలిపోయాయి. లక్షల రూపాయల నష్టం వాటిల్లిన దృశ్యాన్ని చూసి దుకాణ యజమాని గంగాధర్ బోరున విలపించారు. కుటుంబానికి ఏకై క ఆధారమైన దుకాణం పూర్తిగా దగ్ధమవడంతో తీవ్ర ఆర్థిక నష్టానికి గురయ్యామని, ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


