విద్యార్థుల అభ్యసన ఫలితాలు మెరుగుపడాలి
మదనపల్లె రూరల్: మై స్కూల్, మై ప్రైడ్ కార్యక్రమంతో 9, 10 తరగతుల విద్యార్థుల అభ్యసన ఫలితాలు మెరుగుపడాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో...మదనపల్లె సబ్ కలెక్టర్, రాయచోటి, పీలేరు ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, హౌసింగ్ సిబ్బందితో మై స్కూల్, మై ప్రైడ్, జిల్లాలోని ముఖ్యమైన ప్రాజెక్టులకు భూసేకరణ, రీసర్వే, స్వామిత్వ, స్వచ్ఛ ఆంధ్ర తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న గెజిటెడ్ అధికారులు ఆయా పాఠశాలల్లో 9,10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు రోల్ మోడల్‌గా నిలిచి అభ్యసన ఫలితాలను పెంచాలన్నారు. ఇంగ్లీష్ మాట్లాడాలన్న ఆసక్తితో పాటు మాట్లాడగలిగే సామర్థ్యాన్ని పెంచాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించి మంచి ఫలితాలు రాబట్టాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చే అర్జీలపై ప్రజలకు నాణ్యమైన పరిష్కారాలను చూపాలని ఆదేశించారు. వికసిత్ భారత్ జీ రామ్ జీ చట్టం అమలుకు సంబంధించి అన్ని మండలాల ఎంపీడీఓలు అందుబాటులో ఉన్న నిధులను వినియోగించుకుని నిర్దేశించిన లక్ష్యాలు పూర్తిచేయాలన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తిచేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్రపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలో పంపిణీ చేస్తున్న నూతన పట్టాదారు పాసుపుస్తకాలు, రీసర్వే, స్వామిత్వ అంశాలపై జేసీ ఆదర్శ రాజేంద్రన్, రెవెన్యూ, సర్వే సిబ్బందికి పలు సూచనలు చేశారు. సమావేశంలో సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, రాయచోటి, పీలేరు ఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
● జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్


