మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులకు వర్క్‌షాప్
మదనపల్లె సిటీ: విజయవాడ భవానీదీవిలో ఈనెల 9,10 తేదీల్లో జరిగే మార్షల్ ఆర్ట్స్ వర్క్‌షాపును క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. వర్క్‌షాపులో కరాటే, తైక్వాండో, జూడో, కుంగ్‌ఫూ తదితర మార్షల్ ఆర్ట్స్ విభాగాలకు చెందిన క్రీడాకారులు, కోచ్‌లు, శిక్షణార్థులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 7వతేదీ సాయంత్రంలోపు జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ, అన్నమయ్య జిల్లాకు పంపాలన్నారు. వివరాలకు 91547 31106ను సంప్రదించాలని కోరారు.
మదనపల్లె సిటీ: శబరిమలై అయ్యప్ప మాలధారుల కోసం ఈనెల 10న కొల్లం స్పెషల్ రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 10న చర్లపల్లి నుంచి ఉదయం 10.30 గంటలకు బయలుదేరి మదనపల్లె రోడ్డుకు రాత్రి 10.28 గంటలకు చేరుకుని కొల్లంకు 11వతేదీ రాత్రి 10 గంటలకు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణం 12వతేదీన కొల్లం నుంచి ఉదయం 2.30 గంటలకు బయలుదేరి మదనపల్లె రోడ్డుకు రాత్రి 11.48 గంటలకు చేరుకుంటుందన్నారు. అక్కడి నుంచి చర్లపల్లికి 13వతేదీ మధ్యాహ్నం 11.20 గంటలకు చేరుకుంటుందన్నారు. అయ్యప్ప మాలాధారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గాలివీడు: యూత్ గేమ్స్ ఎడ్యుకేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ నేషనల్ ఖోఖో పోటీల్లో అన్నమయ్య జిల్లా, గాలివీడు మండలం అద్వైత గురుకులం పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి విజేతలుగా నిలిచారు. ఈ పోటీల్లో అద్వైత గురుకులం బాలురు,బాలికలు రెండూ జట్లు జాతీయ విజేతలుగా ఎంపిక కావడం విశేషం. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 2 వరకు నేపాల్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ ఖోఖో పోటీలకు ఈ రెండు జట్లు ఎంపికయ్యాయని పాఠశాల చైర్మన్ డాక్టర్ బి. ఇంద్రసేన తెలిపారు.
రాయచోటి టౌన్: రాష్ట్ర స్థాయి అండర్ –19 హాకీ జట్టుకు రాయచోటి రాజు విద్యాసంస్థలకు చెందిన జూనియర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థి కోటకొండ వెంకటేష్ ఎంపికయ్యాడు. అన్నమయ్యజిల్లా జట్టు నుంచి ఈ నెలలో విశాఖపట్టణం జిల్లా నక్కపల్లెలో జరిగిన ఎస్‌జీఎఫ్ అండర్–19 విభాగంలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభను చాటి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు రాయచోటి హాకీ ఫౌండర్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ విద్యార్థి ఈ నెల 12వ తేది నుంచి 17వ తేది వరకు రాజస్థాన్‌లో నిర్వహించే హాకీ పోటీల్లో పాల్గొంటాడని తెలిపారు. వెంకటేష్‌ను ఫౌండర్ సీఐతో పాటు రాజు కళాశాల ప్రిన్సిపల్ శంకర్ నారాయణ తదితరులు అభినందించారు.
కురబలకోట: ఆదాయమే లక్ష్యంగా తక్కువ ఖర్చు ఎక్కువ దిగుబడి వచ్చే పంటలపై రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ సూచించారు. మంగళవారం ఆయన తెట్టులో స్ప్రింకర్లు, డ్రిప్ ద్వారా సాగవుతున్న వేరుశనగ సాగును పరిశీలించారు. రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. పూత దశ పంటకు ప్రాణం పోసే దశన్నారు. ఎఫ్‌పీఓ ద్వారా రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే చిరుధాన్యాల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ ఖర్చు తక్కువ నీటితో ఇవి సాగయి ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ సాగు పద్దతులు అవలంభిస్తే రసాయనిక ఎరువులపై ఖర్చు తగ్గడంతో పాటు భూ సారం సంరక్షించుకోవచ్చన్నారు.
మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులకు వర్క్‌షాప్
మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులకు వర్క్‌షాప్


