బాలికలు అంతర్జాతీయ పోటీల్లోనూ రాణించాలి
జమ్మలమడుగు : బాలికలు జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ క్రీడా పోటీల్లోనూ రాణించాలని బీసీ సంక్షేమశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం వాలీబాల్ జాతీయ స్థాయి క్రీడా పోటీలను ఆమె తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఏ ఆటలోనైనా రాణించవచ్చన్నారు. జమ్మలమడుగు ప్రాంతానికి చెందిన శ్రీచరణి అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌లో పాల్గొని ప్రపంచకప్ సాధించడంలో కీలకంగా మారారని తెలిపారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్యరెడ్డిలు మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనటానికి దేశంలోని నలుమూలల నుంచి తమ జమ్మలమడుగుకు రావడం తమకు గర్వంగా ఉందన్నారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, బద్వేల్ ఇన్‌చార్జి రితేశ్వరరెడ్డి, వాలీబాల్ అసోషియేషన్ సెక్రెటరీ భానుమూర్తి పాల్గొన్నారు.
హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లు
అంతకుముందు వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, కేరళ, హర్యానా, పంజాబ్, మహరాష్ట్ర, తమిళనాడు టీంలు గెలుపొందాయి. గురువారం గెలుపొందిన జట్లతోపాటు ఓడిన జట్ల మధ్య మరోమారు క్వార్టర్ ఫైనల్స్ ఆడనున్నాయి. గెలిలచిన జట్లు శుక్రవారం సెమీఫైనల్‌లో తలపడతాయి. గెలుపొందిన జట్ల మధ్య శనివారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఇన్‌ఛార్జీ మంత్రి సబితా
బాలికలు అంతర్జాతీయ పోటీల్లోనూ రాణించాలి


