పాసు పుస్తకాల్లో తప్పులు
● అధికారులకు తప్పని నిలదీతలు
● అధిక భూ విస్తీర్ణం నమోదుపై
మండిపడుతున్న రైతులు
పెద్దతిప్పసముద్రం : చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమంటూ ఊదర గొడుతూ చేపట్టిన పట్టాదార్ పాసు పుస్తకాల పంపిణీతో రెవెన్యూ అధికారులు రైతుల నుంచి చీవాట్లు ఎదుర్కొంటున్నారు. తప్పులన్నీ చేసేదీ మీరే..మళ్లు మా జేబులకు చిల్లులు పెట్టి చలానా కట్టించుకుని సవరించేది మీరేనా అంటూ రైతులు అధికారులపై మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మండలంలోని మడుమూరు సచివాలయం ఎదుట పాసు పుస్తకాల పంపిణీపై రెవెన్యూ అధికారులు గ్రామసభ నిర్వహించారు. పుస్తకాలు అందుకున్న రైతులు అందులో ఇష్టారాజ్యంగా పొందు పరచిన భూ వ్యత్యాసాలను చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. అస్తవ్యస్తంగా వివరాలు నమోదు చేసి ఇస్తున్న ఈ పుస్తకాల కోసమా ప్రభుత్వం రూ. కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని రైతులు ఎద్దేవా చేస్తున్నారు.
1.75 ఎకరాలుంటే రూ.15 ఎకరాల నమోదు
నాకు ఉన్న భూమి 1.75 ఎకరాలే. రాజముద్రతో మీరిచ్చిన కొత్త పాసు పుస్తకాల్లో మాత్రం 15.90 ఎకరాల భూమి ఉందని నమోదు చేశారు. అధికారులుగా మీరు ఇచ్చిన బుక్కుల ప్రకారం 15 ఎకరాల భూమి ఆన్‌లైన్ చేసి అది ఎక్కడ ఉందో చూపించండి అని శ్రీనివాసులురెడ్డి అనే రైతు తహసీల్దార్ శ్రీరాములు నాయక్‌ను ప్రశ్నించాడు. మళ్లీ చలానా కడితే సవరించి ఇస్తామని తహసీల్దార్ చెప్పడంతో మీరు ఇస్తున్న పాసు పుస్తకాల్లో 90 శాతం అన్నీ తప్పులే ఉన్నాయి..సరిచేసి ఇవ్వాలి కదా అని రైతు తిరిగి ప్రశ్నిస్తూ నిలదీశాడు.
ప్రభుత్వ పథకాలు నిలిచిపోతే
బాధ్యత ఎవరిది?
కూలి చేసుకుని బతికేవాళ్ల. మాకు ఉన్న అరకొర భూములు కాకుండా మాకు లేని భూమి ఉన్నట్లు పాసు పుస్తకాల్లో ఉన్నాయి. మా కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా వస్తున్న పింఛన్, అమ్మ ఒడి, స్కాలర్‌షిప్ లాంటి సంక్షేమ పథకాలు నిలిచిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని రైతులు రెవెన్యూ అధికారుల ఎదుట గోడును వెళ్లబోసుకుంటున్నారు. లేదంటే మా దినసరి కూలి పనులు, సేద్యాలు, పాడి ఆవులన్నీ వదిలేసి భూమి విస్తీర్ణం మార్పుల కోసం చలానా కట్టి నెలల తరబడి మీ ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేయాలా అంటూ మరి కొందరు అధికారులపై మండి పడుతున్నారు.


