మదనపల్లె కోర్టులకు బాంబు బెదిరింపు
మదనపల్లె రూరల్: పట్టణంలోని కోర్టులకు గురువారం బాంబు బెదిరింపులు వచ్చాయి. చిత్తూరు జిల్లా కోర్టుకు ఈ–మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో న్యాయాధికారులు మెయిల్ ద్వారా వచ్చిన లేఖలను పోలీసులకు అందించారు. మదనపల్లెలోని కోర్టు సిబ్బందిని అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ మహమ్మద్ రఫీ, తాలూకా సీఐ కళావెంకటరమణ పోలీసు సిబ్బందితో కోర్టు ఆవరణకు చేరుకున్నారు. కోర్టు ప్రాంగణం, పరిసరాలు, కోర్టు భవనాలు క్షుణ్ణంగా పరిశీలించారు. బాంబు బెదిరింపు సమాచారాన్ని బాంబ్ స్క్వాడ్‌కు తెలియజేశారు. అనంతరం బాంబ్ స్క్వాడ్ కోర్టుకు చేరుకుని జిల్లా ఏడీజే కోర్టుతో పాటు మిగిలిన 8 కోర్టు భవనాలలోనూ బాంబ్ డిటెక్టింగ్ యంత్రం సహాయంతో తనిఖీలు చేపట్టారు. బాంబులు లేవని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


