జిల్లా ఫైర్ ఆఫీసర్‌గా ఆదినారాయణరెడ్డి
రాయచోటి టౌన్: అన్నమయ్య జిల్లా ఫైర్ ఆఫీసర్‌గా ఎం.ఆదినారాయణరెడ్డి బాధ్యతలు చేపట్టారు. అనంతరం నియోజక వర్గాల అధికారులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈయన స్థానంలో జిల్లా ఆఫీసర్‌గా పని చేసిన అనిల్ కుమార్ రెడ్డి గుంటూరు జిల్లా సత్తెనపల్లెకు వెళ్లారు.
కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ యాన్యువల్ అకడమిక్ క్యాలెండర్‌ను అనుసరించి జిల్లా లోని అన్ని జూనియర్ కళాశాలలకు ఈ నెల 10వ తేది నుంచి 18వ తేది వరకు సంక్రాంతి సెలవులుగా ప్రకటించినట్లు ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి టిఎన్‌యు వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంక్రాంతి సెలవులలో ఎవరైనా తరగతులు నిర్వహిస్తే బోర్డు నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.
కడప ఎడ్యుకేషన్: ఈనెల 10వ తేదీ ఉదయం 9.30 గంటలకు కడప సీఎస్‌ఐ ఉన్నత పాఠశాలలో టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ(టీహెచ్‌బీఎస్) సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సొసైటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విశ్వనాథరెడ్డి, బాలశౌరిరెడ్డిలు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో పబ్బాపురం ప్లాట్ల సాధనపై ప్రత్యేక చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. కావున సొసైటీ సభ్యులంతా విరివిగా పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.
మదనపల్లె సిటీ: సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడా పోటీలు ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ది సంస్థ అధికారి జి.చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు రాయచోటి మండలం నక్కవడ్లపల్లి వద్దనున్న డీఎస్‌ఏ క్రికెట్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు జరుగుతాయన్నారు. మహిళలు స్కిప్పింగ్, తొక్కొడు బిళ్ల, కర్రసాము–పురుషులు, మహిళలు– లగోరీ( 7 పెంకులాట)–పురుషులు, తాడిపోరు (టగ్ ఆఫ్ వార్) పురుషులు, మహిళలు– గాలిపటం పోటీలు– పురుషులకు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీలలో ప్రజలు, డ్వాక్రా, వెలుగు గ్రూపు మహిళలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొనాలని కోరారు. మరిన్ని వివరాలకు 9154731106 నంబరులో సంప్రదించాలని కోరారు.


