రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పీఎండీడీకేవై అమలు
పీలేరు: రైతుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) కార్యక్రమాన్ని అమలు చేయాలని నోడల్ అధికారి బాలమురగన్, కలెక్టర్ నిశాంత్‌కుమార్ అన్నారు. శుక్రవారం వారు మండలంలోని గూడరేవుపల్లె పంచాయతీ పుట్టావాండ్లపల్లెలో పర్యటించారు. స్థానిక రైతులు, ఎఫ్‌పీవోలతో మాట్లాడుతూ పీఎండీడీకేవై పథకం గూర్చి వివరించారు. జిల్లాలో మామిడి కాయలకు కవర్లను సబ్సిడీతో రైతులకు అందించి వాటిని మామిడి పంటకు ఏర్పాటు చేయించడం ద్వారా పంట ఉత్పత్తి, పంట నాణ్యత ఏ విధంగా పెరుగుతుందో తెలియజేశారు. ఈశ్వరయ్య అనే రైతు తన వ్యవసాయ భూమిలో మామిడి, మిరప, వేరుశెనగ పంటలను అధికారులకు చూపించి ఏ విధంగా మల్టీ క్రాపింగ్ చేస్తున్నాడో వివరించారు. మరో రైతు కృష్ణయ్య సాగు చేసిన డ్రాగన్ ఫ్రూట్, అందులో అంతర పంటగా సాగు చేసిన డేట్‌పామ్ తోటను పరిశీలించారు. పీలేరులో తమకు అనుకూలంగా మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. మామిడి పంటకు సూక్ష్మ పోషకాలు అందించగలిగే పంట బాగా వస్తుందన్నారు. పంటలకు ఇచ్చే బీమా, టమాట ప్రాసెసింగ్, తదితర అంశాలపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, సూక్ష్మ నీటి పారుదల శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేడీఏ శివనారాయణ, జిల్లా ఉద్యాన అధికారిణి సుభాషిణి, జిల్లా సూక్ష్మ నీటి అధికారిణి లక్ష్మీప్రసన్న, జిల్లా పశువైద్యాధికారి గుణశేఖర్, తహసీల్దార్ శివకుమార్, ఏఎంసీ చైర్మన్ రామ్మూర్తి, రైతులు పాల్గొన్నారు.
నోడల్ అధికారి బాలమురగన్,
కలెక్టర్ నిశాంత్‌కుమార్


