ఆత్మీయ కలయికకు వేళాయే!
● 14న రాజంపేటలోఓల్డ్ ప్లేయర్స్ క్రికెట్ మ్యాచ్
● క్రికెట్ మ్యాచ్ ఆడేందుకుసిద్దమవుతున్న వెటరన్ క్రీడాకారులు
రాజంపేట టౌన్ : సంక్రాంతి పండుగ ఆత్మీయ కలయికలకు వేదిక అవుతుంది. ఇటీవల కాలంలో అందరిది ఉరుకులు, పరుగులమయమైన జీవనమైంది. అందువల్ల సన్నిహితులను, స్నేహితులను చివరికి దగ్గరి బంధువులను కూడా స్వయంగా కలుసుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో రాజంపేటలో కొంత మంది మాజీ క్రికెట్ క్రీడాకారులు సంక్రాంతి సందర్భంగా ఆత్మీయ కలయిక పేరుతో ఈనెల 14వ తేదీ భోగి పండుగ రోజున క్రికెట్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ ఆడేవారంతా ఒకప్పుడు రాయలసీమలోనే పేరుగాంచిన రాజంపేట క్రికెట్‌క్లబ్ (ఆర్‌సిసి) ప్లేయర్స్ కావడం విశేషం. 1990 దశకంలో ఏర్పాటైన ఆర్‌సీసీ కొన్ని దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగింది. తాజాగా ఆర్‌సీసీకి చెందిన మాజీ క్రీడాకారులంతా భోగి పండుగ రోజు క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యారు. వీరిలో దాదాపు అందరు ఐదు, ఆరు పదుల వయస్సు పైబడిన వారు కావడం విశేషం. వీరిలో కొంత మంది ప్రముఖ రాజకీయ నాయకులు, పట్టణ ప్రముఖులు, ఉన్నత స్థాయి అధికారులు, వివిధశాఖల్లో పనిచేసే ఉద్యోగులు,రిటైర్డ్ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఉన్నారు. ఈనెల 14వ తేదీ జరిగే ఆత్మీయ క్రికెట్ మ్యాచ్ కోసం శ నివారం ఆర్‌సీసీ మాజీ క్రీడాకారులైన షేక్ అబ్దుల్లా, పసుపులేటి గోపినాధ్, చిట్వేలి రవికుమార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని క్రీడామైదానంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహణ కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. ఆర్‌సిసి వ్యవస్థాపకులైన మున్సిపల్ ఛైర్మన్ పోలా శ్రీనివాస్‌రెడ్డి, ప్రముఖ న్యాయవాది కాశిరెడ్డి గిరిచంద్రారెడ్డిని కలిసి ఆత్మీయ క్రికెట్ మ్యాచ్‌కు ఆహ్వానించారు.
ఆత్మీయ కలయికకు వేళాయే!


