చంద్రబాబు సీమ ద్రోహి
అన్ని ప్రాజెక్టుల్లో నీటిని నింపిన ఘనత వైఎస్ జగన్‌దే : సురేష్ బాబు
సీఎం చంద్రబాబు కేసులకు భయపడి తెలంగాణకు దాసోహం అయ్యారని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు అంజద్‌బాషా ఎద్దేవా చేశారు. రాయలసీమ ఎంతో వెనుకబడిన ప్రాంతమని, దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతపురం రాయలసీమలోనే ఉందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.1000కోట్లతో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను నేనే ఆపానని తెలంగాణ సీఎం అంటుంటే ఈ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. తాము కృష్ణా జలాల్లో వాటా అడుగుతుంటే బనకచెర్ల నుంచి గోదావరి నీటిని తెస్తానని సీఎం చెప్పడం దారుణమన్నారు. ఈ ప్రాజెక్టు వెంటనే పూర్తిచేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
కడప కార్పొరేషన్ : రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపడాన్ని మించిన ద్రోహం మరొకటి లేదని... సీఎం చంద్రబాబు సీమ ద్రోహి అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, రాజంపేట పార్లమెంటు పరిశీలకులు కె. సురేష్ బాబులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం రాయలసీమ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టడం దారుణమన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రి ఖండించలేని స్థితిలో ఉన్నారన్నారు. కృష్ణా జలాలపై తాము మాట్లాడుతుంటే గోదావరి జలాల గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. కృష్ణా జలాలు లేకపోతే రాయలసీమ ఎడారిగా మారుతుందని హెచ్చరించారు. శ్రీశైలంలో 845 అడుగులకు నీరు వస్తేగానీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమకు నీరు వచ్చే అవకాశం లేదన్నారు. మొదటి ప్రాధాన్యత తాగునీటికి, ఆ తర్వాత సాగునీటికి ఇవ్వాలని, ఆ రెండింటి తర్వాతే విద్యుత్ ఉత్పత్తికి నీటిని వాడాల్సి ఉందన్నారు. కానీ అందుకు భిన్నంగా శ్రీశైలంలో 845 లెవెల్‌కు చేరకముందే తెలంగాణ నీటినంతా విద్యుత్ ఉత్పత్తికి తరలించుకుపోతోందన్నారు. 16 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు రాయలసీమ అంటే ఎప్పుడూ ద్వేషమేనని, కడప జిల్లా అంటే అసలు పడదన్నారు. అందుకే ఇక్కడి ప్రాజెక్టులను ఆయన పూర్తి చేయలేదని, దివంగత వైఎస్సార్ సీఎం అయిన తర్వాతే ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయన్నారు. ఇక శ్రీశైలం నుంచి 800 అడుగుల్లోనే నీటిని తోడేందుకు వీలుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2022లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మొదలు పెడితే చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకొని దాన్ని నిలిపేయడం దుర్మార్గమన్నారు. సీమ ప్రజలు తిరుపతి, హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్‌టీఆర్‌ను గెలిపించారని, ఆయన కుమారులు హరిక్రిష్ణ, బాలక్రిష్ణలను కూడా ఎమ్మెల్యేలుగా గెలిపించారని గుర్తు చేశారు. ఇలా టీడీపీకి రాజకీయ భిక్ష పెట్టిన రాయలసీమకు ద్రోహం తలపెట్టడం తగదని హితవు పలికారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మళ్లీ ప్రారంభించాలని, లేకుంటే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఎలాంటి పోరాటానికై నా సిద్ధమని హెచ్చరించారు. రాష్ట్ర బడ్జెట్‌నంతా అమరావతిలోనే ఖర్చు చేస్తున్నారని, లక్ష కోట్లకు టెండర్లు పిలిచి పనులు చేస్తున్నారని రఘురామిరెడ్డి అన్నారు. అమరావతి రాజధానికి అనువైనది కాదని అన్ని కమిటీలు చెప్పాయని, అయినా అక్కడే రాజధాన్ని నిర్మిస్తూ వరద నీటిని బయటికి పంపడానికి రూ.423కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. వేలకోట్లు ఖర్చు చేసి వరదనీటిని బయటికి పంపి రాజధాని కట్టాల్సిన ఆవశ్యకత ఏమిటని ప్రశ్నించారు.
రాయలసీమను రాళ్లసీమగా మార్చవద్దు
– ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి
మాజీ ముఖ్యమంత్రులు వైఎస్సార్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమలో బంగారు పంటలు పండించడానికి అనువుగా ప్రాజెక్టులు చేపట్టారని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు వాటిని అడ్డుకొని రాయలసీమను రాళ్లసీమగా మార్చవద్దని కోరారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం వల్ల నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కూడా మేలు జరుగుతుందని, కుప్పానికి కూడా తాగునీరు ఇచ్చే అవకాశముంటుందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, పార్టీ నాయకులు దాసరి శివప్రసాద్, రామ్మోహన్‌రెడ్డి, మియ్యా, నాగమల్లారెడ్డి పాల్గొన్నారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపడం దారుణం
టీడీపీకి రాజకీయ భిక్ష పెట్టింది
రాయలసీమ ప్రజలే
రాష్ట్ర బడ్జెట్ అంతా
అమరావతిలోనే ఖర్చు చేస్తున్నారు
వరదనీటిని బయటికి పంపడానికే రూ.423కోట్లా!
వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్
ఎస్. రఘురామిరెడ్డి ధ్వజం
రాయలసీమలోని అన్ని ప్రాజెక్టుల్లో 62 టీఎంసీల నీటిని నింపిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనని రాజంపేట పార్లమెంటు పరిశీలకులు కె. సురేష్ బాబు అన్నారు. ఎన్‌టీఆర్‌ను పదవీచ్యుతున్ని చేసి గద్దెనెక్కిన చంద్రబాబు ప్రాజెక్టులకు శంకుస్థాపనలతోనే సరిపెట్టారే తప్పా ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. దివంగత వైఎస్సార్ మాత్రమే రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేశారని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వైఎస్సార్ 44వేల క్యూసెక్కులకు పెంచారని, మాజీ సీఎం వైఎస్ జగన్ దాన్ని 80వేల క్యూసెక్కులకు పెంచడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టారన్నారు.


