నారసింహునికి విశేష పూజలు
గుర్రంకొండ: మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారికి విశేషపూజలు నిర్వహించారు. శనివారం టీటీడీ వారి ఆధ్వర్యంలో ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి పలు రకాల నైవేద్యాలు సమర్పించి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. తోమాల సేవ, ఏకాంతసేవ కావించారు. ఈ సందర్భంగా స్వామివారిని రంగురంగుల పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని స్వామివారిని సేవించుకొన్నారు. అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయఅర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
కడప కోటిరెడ్డిసర్కిల్: గండికోటలో ఈనెల 11, 12 13 తేదీలలో జరిగే ఉత్సవాల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుందని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు డిపోల నుంచి గండికోటకు ప్రత్యేక సర్వీసులుంటాయన్నారు. జమ్మలమడుగు డిపో నుంచి 20 బస్సులు, కడప 8, ప్రొద్దుటూరు 8, మైదుకూరు 3 బస్సులు, మొత్తం 39 బస్సులు రాకపోకలు సాగిస్తాయన్నారు. జమ్మలమడుగు నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు చొప్పున ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు బస్సులు తిరుగుతాయన్నారు.
కడప కోటిరెడ్డిసర్కిల్ : బాల్య వివాహాలు చట్టవ్యతిరేకమని, ఇందుకు తగిన శిక్షలు ఉన్నాయని పారా లీగల్ వలంటీర్లు నిర్మల, దశరథ రామిరెడ్డి, ఈశ్వరయ్యలు తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని, న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫకృద్దీన్ సూచనలతో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులచే చెన్నూరులో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కడప ఎడ్యుకేషన్: కేంద్రీయ విశ్వవిద్యాలయ ఉమ్మడి ప్రవేశ పరీక్షపై (అండర్ గ్రాడ్యుయేట్ ) 11వ తేదీ ఆదివారం సాయంత్రం 7 గంటలకు నుంచి 8.30 వరకు ఆన్‌లైన్ గూగుల్ ద్వారా వెబినార్ నిర్వహిస్తామని సైన్స్ క్లబ్ అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని 200 పైగా సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు, ప్రైవేటు డీమ్డ్ టు బి యూనివర్సిటీలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశం కోసం జరిపే ఈ పరీక్ష ద్వారా విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐకార్) గుర్తింపు పొందిన కళాశాలల్లో వ్యవసాయ కోర్సులకు కూడా ఈ పరీక్ష ప్రవేశ మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గూగుల్ వెబి నార్ లింకు https://meet. google.com/ qgd&umvd&cvx,యూట్యూబ్ లింకు https:// youtube.com /live/RVYxs4V nS98?feature =shareలో చూడాలని తెలిపారు.
కడప సెవెన్‌రోడ్స్: ప్రముఖ రచయిత, చరిత్రకారుడు తవ్వా ఓబుల్ రెడ్డి రచించిన గండికోట గ్రంథం ఇప్పుడు ఇంగ్లీషు భాషలో వెలువడుతోంది. పుస్తక రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి ఈ పుస్తకాన్ని స్వయంగా ఆంగ్లంలోకి అనువదించారు. గండికోట ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. తెలుగులో ఐదుసార్లు ముద్రించబడి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ పర్యాటక గ్రంథంగా 2013లో అవార్డుకు ఎంపికై ంది. ఈ పుస్తకం ఇప్పుడు ఇంగ్లీషులో కూడా వెలువడుతుండటంతో గండికోట చరిత్ర, వైభవం గురించి ఇతర రాష్ట్రాల, విదేశీ పర్యాటకులకు కరదీపిక కానుంది. తెలుగు పుస్తకంలోని అంశాలకు అదనంగా గండికోట చరిత్రకు సంబంధించిన అనేక కొత్త అధ్యాయాలను ఈ ఇంగ్లీషు పుస్తకంలో పొందుపరిచినట్లు పుస్తక రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి తెలిపారు.
నారసింహునికి విశేష పూజలు


