పచ్చపార్టీలో రచ్చ!
పట్టు తప్పిందా?
మదనపల్లె: టీడీపీ మదనపల్లెలో పాత, కొత్త నేతల మధ్య పదవుల రచ్చ మొదలై అమరావతికి చేరింది. శుక్రవారం జరిగిన సంస్థాగత ఎన్నికల్లో మదనపల్లె పట్టణం, మండలాల అధ్యక్ష పదవులకు పార్టీ పరిశీలకులు ఎన్నిక నిర్వహించారు. ఇందులో ఎవరూ ఊహించని విధంగా పార్టీలోని సీనియర్ నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఎమ్మెల్యే షాజహన్‌బాషా వర్గం జీర్ణించుకోలేకపోతోంది. పదవులన్నీ తమ వర్గానికే దక్కుతాయన్న ఆశతో ఇంతకాలం ఎదురుచూసిన ఆయన వర్గీయులకు ఈ ఎన్నిక వ్యవహరం మింగుడుపడటం లేదు. చాలాకాలం క్రితమే పట్టణ, మండలాలకు అధ్యక్షులు ఎవరనేది ఎమ్మెల్యే వర్గీయులు ముందుగానే నిర్ణయించుకున్నారు. అయితే సమావేశం నిర్వహించాక ఎమ్మెల్యే వర్గానికి ఊహించని పరిణామం ఎదురైంది. సమావేశాల్లో మదనపల్లె పట్టణ అధ్యక్షుడిగా అరుణ్‌తేజ్, మదనపల్లె రూరల్ మండలానికి డి.శ్రీనివాసులు, రామసముద్రం అధ్యక్షుడిగా విజయ్‌కుమార్, నిమ్మనపల్లె అధ్యక్షుడిగా రాజన్నలను ఎన్నుకోవడం, ప్రకటించడం జరిగిపోయింది. ఎన్నికై న వారిలో అరుణ్‌తేజ మినహా అందరూ 30ఏళ్లకు పైబడిన సీనియర్లే. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే వర్గంలో కలకలం రేగింది. తమకు ఒక్క పదవీ దక్కలేదన్న ఆందోళనతో పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు శుక్రవారం రాత్రికి రాత్రే ఎమ్మెల్యే సహా ఆయన వర్గీయులు అమరావతి బయలుదేరి వెళ్లినట్టు, శనివారం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తమ వర్గానికి అన్యాయం జరిగిందని చెప్పుకునేందుకే ఎమ్మెల్యే వెళ్లినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ వర్గాలుగా విడిపోయి ఇదేవిషయాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటున్నాయి.
పాత, కొత్త రచ్చ
టీడీపీ మదనపల్లె నియోజకవర్గ అధ్యక్షుల ఎన్నిక వ్యవహారం పాత టీడీపీ, కొత్త టీడీపీ అన్నట్టుగా రెండు వర్గాలైంది. ఇందులో ప్రస్తుతం పదవులు పొందిన నేతలు పాత టీడీపీ అని, పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం జరిగిందని బహిరంగంగా అంటున్నారు. తాము కొత్తగా పార్టీలోకి వచ్చి పదవులు ఆశించలేదు, కష్టపడ్డామనే ఎన్నుకుని గుర్తించారని అంటున్నారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే వర్గంలో అంతర్మథనం మొదలైంది. కొత్తగా వచ్చిన వాళ్లంటే ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చినవారే కదా అంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఎమ్మెల్యే వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పైగా పదవులు పొందిన కొత్త అధ్యక్షులు శనివారం వేసిన బ్యానర్లలో ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంపై కూడా ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేను గుర్తించరా, ఇది పార్టీ ధిక్కారం అంటూ గళం విప్పుతున్నారు. దాంతో ఇప్పుడు టీడీపీలో పాత, కొత్త రచ్చ ఒకవైపు ఉండగానే.. ఎమ్మెల్యే కొత్త అధ్యక్షుల విషయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరచక పోవడంతో ఏం జరుగుతుందో అని క్యాడర్ ఆసక్తిగా చూస్తోంది.
నిన్నటిదాకా ఎమ్మెల్యే నిర్ణయించిన వారికే పార్టీ పదవులు దక్కుతాయని, దీనిపై ఆయన వర్గీయులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఊహించని పరిణామాలతో ఎమ్మెల్యే ఈ వ్యవహరంపై ఎలా వ్యవహరించబోతున్నారదనేది ఉత్కంఠగా మారింది. కొత్త అధ్యక్షుల ఎన్నికలో తన ముద్ర లేకపోగా, పదవులేవీ తన అనుచరులకు దక్కకపోవడం ద్వారా పార్టీలో ఎమ్మెల్యే పట్టు తప్పిందన్న సంకేతాలు ఇప్పటికే వెళ్లాయి. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే పార్టీలో తనకు వ్యతిరేక వర్గం లేకుండా పా పట్టు ఎలా నిలుపుకుంటారన్నది చర్చనీయాంశమైంది.
టీడీపీ పదవుల్లో సీనియర్ నాయకులదే హవా
మదనపల్లె ఎమ్మెల్యే వర్గానికిఒక్కటీ దక్కని పట్టణ, మండలఅధ్యక్ష పదవులు
తామే నిజమైన పార్టీనేతలంటున్న కొత్తనేతలు
ఉన్నఫళంగా అమరావతికి ఎమ్మెల్యే, వర్గీయులు


