ముగిసిన ఏఆర్ ఎస్‌ఐ అంత్యక్రియలు
పీలేరురూరల్ : మండలంలోని తలపుల పంచాయతీ పెద్దహరిజనవాడకు చెందిన దండు ఓబయ్య (55) అన్నమయ్య జిల్లా పోలీస్ విభాగంలో ఏఆర్ ఎస్‌ఐగా విధులు నిర్వహించేవారు. శుక్రవారం గుండెపోటుకు గురి కావడంతో చికిత్సనిమిత్తం తిరుపతికి తరలించారు. చికిత్సపొందుతూ మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తక్షణసాయంగా రూ. లక్ష అందజేశారు. ఆర్‌ఐ రామకృష్ణ, ఆర్‌ఎస్‌ఐ శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది ప్రభుత్వ లాంఛనాలతో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు చేసి అంతిమ సంస్కరణలు నిర్వహించారు.
రోడ్డు ప్రమాదంలో
విద్యార్థిని మృతి
కేవీపల్లె : సంక్రాంతి పండుగకు ఇంటికి వెళుతున్నానన్న ఆనందం.. రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబలించడంతో విషాదంగా మారింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో విద్యార్థిని మృతి చెందిన సంఘటన మండలంలోని మహల్‌రాజుపల్లె వద్ద చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సంబేపల్లె మండలం దేవపట్లకు చెందిన శివరాణి (17) తిరుపతిలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడిట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శనివారం నుంచి సంక్రాంతి సెలవులు కావడంతో శివరాణి తన అన్న మల్లీశ్వరతో కలసి ద్విచక్రవాహనంలో తిరుపతి నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గం మధ్యలో మహల్‌రాజుపల్లె వద్ద కడప నుంచి చిత్తూరు వెలుతున్న కారు ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం 108 పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో శివరాణి మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటశివకుమార్ తెలిపారు.
నాటుసారా విక్రేతల అరెస్ట్
పెద్దమండ్యం : నాటుసారా తయారు చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేయడంతో పాటు వారి నుంచి సారా స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ పి. శ్రావణి తెలిపారు. మండలంలోని దిగువపల్లె గ్రామం వడ్డివంకతండాలో నాటుసారా తయారీ, విక్రయాలు చేస్తున్నారనే సమాచారం మేరకు శనివారం సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించినట్లు తెలిపారు. దాడుల్లో తండాకు చెందిన లక్ష్మానాయక్, మునేనాయక్‌లు పట్టుబడినట్లు వెల్లడించారు. వీరి వద్ద నుంచి 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈమేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామని ఎస్‌ఐ తెలిపారు.
ముగిసిన ఏఆర్ ఎస్‌ఐ అంత్యక్రియలు


