● ప్రభుత్వ కార్యాలయాలతో ఆందోళన
కూటమి రాకతో గాలికి..
మదనపల్లె: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలోని బిసెంట్ థియోసాఫికల్ కళాశాల (బీటీ కళాశాల) ఒక చరిత్రాత్మక విద్యా సంస్థ. 1915లో ఐరిష్ వనిత అన్నీబిసెంట్ స్థాపించిన ఈ కళాశాల దేశ స్వాతంత్ర పోరా టంలో జాతీయవిద్యకు కేంద్రమైంది. రాయలసీమలో తొలి కళాశాల, లక్షల మంది విద్యార్థులకు విద్యా దీపమై వెలిగి, స్వాతంత్య్ర ఉద్యమానికి కేంద్రంగా పోరుబాట నడిపించింది. తొలి తరం నుంచి మొన్నటి తరం వరకు ఇక్కడ చదువుకున్న విద్యార్థుల్లో మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, మాజీ గవర్నర్ పెండేకంటి వెంకటసుబ్బయ్య లాంటి ఉన్నతస్థానాలకు ఎదిగినవారు, ఎందరో మంత్రులు, ఎమ్మెల్యేలు, విద్యావేత్తలు, పారిశ్రామిక, శాస్త్రవేత్తలు.. ఇలా అన్నిరంగాల్లో మేధావులను అందించిన బీటీ కళాశాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఏటా 5వేల మందికిపైగా విద్యార్థులతో కళకళలాడిన కళాశాలను ఇప్పుడు పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. వందల కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ఈ కళాశాలకు మళ్లీ పూర్వవైభవం తేవాలని, జిల్లాకు విశ్వవిద్యాలయం అందించాలన్న ఆశయంతో ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి చేసిన కృషి, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూటమి ప్రభుత్వం రాగానే నీరుగార్చింది. కళాశాల స్థితిగతులను గాలికి వదిలేసింది. ప్రస్తుతం కేవలం 154 మంది విద్యార్థులతో కళాశాల దీనంగా నడుస్తోంది.
మిథున్‌రెడ్డి కృషితో..
ఎయిడెడ్ బీటీ కళాశాలను ప్రభుత్వంలో విలీనం చేసి నడపాలన్న డిమాండ్‌తో ఉద్యమాలు జరిగాయి. స్పందించిన ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి ఈ విషయమై విద్యావేత్తలు, మేధావులతో సమీక్షించి.. చర్చలు జరిపి వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. కళాశాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపడం సముచితమన్న నిర్ణయానికి వచ్చి బీటీ కళాశాల ట్రస్టీలతో చర్చించాక వారు సుముఖత వ్యక్తం చేశారు. దాంతో డిగ్రీ కళాశాలను, దానికి సంబంధించిన ఆస్తులు, వగైరాలు ప్రభుత్వానికి అప్పగించడంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ 2022 ఆగస్టు, 16న జీవో జారీ చేసింది. తర్వాత అన్నయ్యజిల్లాకు విశ్వవిద్యాలయం లేకపోవడంతో ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి కృషితో ప్రభుత్వం 2024 ఫిబ్రవరి, 9న అన్నీబిసెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ఈ జీవోలోనే మిథున్‌రెడ్డి సిఫార్సు మేరకు అని స్పష్టంగా పేర్కొన్నారు.
విలువైన ఆస్తులు సమకూర్చి..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అన్నీబిసెంట్ యూనివర్సిటీ ఏర్పాటుకు జీవో జారీ చేయకముందే బీటీ కళాశాల ట్రస్ట్ నుంచి సుమారు రూ.150 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి చెందేలా చేసింది. కళాశాల ట్రస్ట్‌కు 47.36 ఎకరాలు ఉండగా, అందులో 11.86 ఎకరాలను ప్రభుత్వానికి, కళాశాలను అప్పగించారు. దాంతో విశ్వవిద్యాలయం చేసేందుకు కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సమస్య ఎదురు కాలేదు. కావాల్సినన్ని భవనాలు, భూమి అందుబాటులోకి వచ్చాయి.
కూటమి ప్రభుత్వం అన్నీబిసెంట్ విశ్వవిద్యాల యం ఏర్పాటుపై చర్యలు తీసుకోకపోగా ఇప్పు డు కళాశాల భవనాల్లో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేస్తుండటంపై ప్రజలు, సంఘాలు, పార్టీల నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. విశ్వవిద్యాలయం ఏర్పాటు కలను ప్రభుత్వం చెరిపేస్తోందన్న భావన కలుగుతోంది. బీటీ కళా శాలలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు అవుతున్నందున ఇక కళాశాల అభివృద్ధి ఉండదని, విశ్వవిద్యాలయంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చర్చించుకొంటున్నారు. ఈ విష యమై ప్రజా సంఘాలు ఇప్పటికే ప్రశ్నిస్తున్నా యి. బీటీ కళాశాలలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసి కళాశాలను ఎత్తివేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో బీటీ కళాశాలకు యూనివర్సిటీగా గుర్తింపు
అభివృద్ధి పనులకు రూ.5 కోట్లు మంజూరు
కూటమి పాలకుల నిర్లక్ష్యంతోఒక్క అడుగు ముందుకు పడలేదు
ఇప్పుడు జిల్లా కార్యాలయాలకువినియోగంపై ఆందోళన
ఐరిష్ వనిత, హోంరూల్ ఉద్యమంనడిపిన అన్నీబిసెంట్ స్థాపించినచరిత్రాత్మక విద్యాసంస్థ
1919, 1929లో ఠాగూర్, గాంధీ సందర్శన
ఎంతో ఖ్యాతి కలిగిన కళాశాలమనుగడపై నీలినీడలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈపాటికి విశ్వవిద్యాలయ కార్యాచరణ మొదలై దాని ఫలితాలు కనిపించేవి. కూటమిపాలన రాకతోనే ఈ కళాశాలను నిర్లక్ష్యం చేశారు. ఇంటర్మీడియట్ కోర్సులు ఎత్తేశారు. డిగ్రీ కళాశాల నిర్వహణ ఉన్నప్పటికీ, దాని అభివృద్ధికి ఒక్క చర్య తీసుకోలేదు. అడ్మిషన్ల పరిస్థితి, అధ్యాపకులు, సిబ్బంది స్థితిగతులపైనా సమీక్ష లేదు. ప్రిన్సిపాల్ రిటైర్ అయి నెలలు గడుస్తున్నా రెగ్యులర్ ప్రిన్సిపాల్ నియామకం లేదు. విద్యార్థుల సంఖ్య పెంచే చర్యలు శూన్యం. చరిత్ర కలిగిన కళాశాల విషయంలో కూటమి పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని ఫలితంగానే విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ముందడుగు పడటం లేదు. దీనిని గత ప్రభుత్వం చేపట్టింది, తమకెందుకనే ధోరణి వ్యక్తం అవుతోంది. దాంతో పేద విద్యార్థులకు అందించే విద్యపైన రాజకీయాలు మొదలయ్యాయి. ప్రస్తుతం డిగ్రీకళాశాలలో మూడేళ్లకు కలిపి కేవలం 154 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు.
స్పందన లేకుంటే ఉద్యమరూపం
బీటీ కళాశాలకు పూర్వవైభవం తేవడమే కాక, విశ్వవిద్యాలయంతో విద్యాభివృద్దికి కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంగా భావించకుండా పేద విద్యార్థులు, మారుమూలన ఉన్న మదనపల్లె అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేకుండా చర్య లు చేపట్టాలని జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు. లేనిపక్షంలో ఉద్యమించేందుకు ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఈ సంఘాలు కళాశాల అభివృద్ధిని, భవిష్యత్తును ప్రశ్నిస్తున్నాయి. దీంతో పరిస్థితులు ఉద్యమరూపం దాల్చకముందే ప్రభుత్వం స్పందించాలని పరిశీలకులు కోరుతున్నారు.
● ప్రభుత్వ కార్యాలయాలతో ఆందోళన
● ప్రభుత్వ కార్యాలయాలతో ఆందోళన


