బాబు హయాంలోనే సీమకు అన్యాయం
రాయచోటి: రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగింది చంద్రబాబు పాలనలోనే అని కడప జెడ్పీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం ఆరోపించారు. రాయచోటిలోని ఆయన స్వగృహంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై తెలంగాణ రాష్ట్రంతో కుమ్మకై తీవ్ర ద్రోహానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందాన్ని బయటపెట్టడంతో నిజాలు వెలుగుచూశాయన్నారు. ఇప్పుడేడో దొంగే దొంగ దొంగా అన్న రీతిలో టీడీపీ నాయకులు జగన్‌మోహన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినా కృష్ణా జలాలలను రాయలసీమ ప్రాంత ప్రజలకు అందివ్వడంలో బాబు విఫలమయ్యారన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గండికోట నుంచి కడప, అన్నమయ్య జిల్లాలోని అనేక ప్రాజెక్టులు, చెరువులకు కృష్ణా జలాలను అందించేందుకు రూ. 3600 కోట్లతో ఎత్తిపోతల పథకాలను ప్రారంభించి 70 శాతంకుపైగా పనులు పూర్తి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందన్న ఉద్దేశ్యంతోనే పనులను నిలుపుదల చేయలేదంటూ తిరిగి విమర్శలు చేయడం టిడిపి నాయకులకే చెల్లిందన్నారు. చంద్రబాబు నాయుడు రాయలసీమకు చేసిన ద్రోహం బయట పడటంతో రాష్ట్ర ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. బాబు మోసానికి రానున్న ఎన్నికలలో రాయలసీమ ప్రాంత ప్రజలు ఓటుతో తగిన గుణపాఠం తప్పక చెబుతారని బాలసుబ్రమణ్యం హెచ్చరించారు.
జగన్ హయాంలో చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్‌కు బాబు బ్రేకులు వేశారు
జెడ్పీ మాజీ చైర్మన్ సుగవాసి బాల సుబ్రమణ్యం


