నాలుగు జిల్లాల సీటు!
రాజంపేట పార్లమెంటు..
మదనపల్లె: దేశ రాజకీయాల్లో రాజంపేట పార్లమెంటు స్థానానికి ఉన్న ప్రాధాన్యత ఏ నియోజకవర్గానికి లేదు. మనకు స్వాతంత్య్రం వచ్చాక జరిగిన తొలి సాధారణ ఎన్నిక 1952 నుంచి 2024 ఎన్నిక వరకు రాజంపేటకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు జిల్లాల పరిధిలో ఉన్న ఈ స్థానం ఇప్పుడు నాలుగుజిల్లాల పరిధికి చేరింది. ముగ్గురు ఎంపీలు హ్యాట్రిక్ సాధించగా ఒకరు డబుల్ హ్యాట్రిక్ సాధించారు. ఇక 1957 ఎన్నికలో ఎన్నికే లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక జరగడం విశేషం. వార్డు సభ్యుని పదవికి పోటాపోటి ఉండే పరిస్థితుల్లో గౌరవ ప్రదమైన లోక్‌సభ ఎంపీ పదవికి పోటీయే లేదంటే ఇక్కడి నేతల గొప్పదనం అర్థమవుతుంది.
తొలి ఏకగ్రీవం ఎన్నిక
1957లో జరిగిన రెండవ పార్లమెంటు ఎన్నికల్లో రాజంపేట స్థానం నుంచి తంబళ్లపల్లెకు చెందిన టిఎన్.విశ్వనాథరెడ్డి పోటీకి సిద్ధమై నామినేషన్ దాఖలు చేశారు. దేశ వ్యాప్తంగా 543 ఎంపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే రాజంపేట ఎంపీ స్థానానికి ఒకేఒక నామినేషన్ దాఖలైంది. ఆ నామినేషన్ టిఎన్.విశ్వనాథ రెడ్డిదే కావడంతో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ప్రకటించారు. దేశంలో పార్లమెంటు సభ్యుని తొలి ఏకగ్రీవ ఎన్నికగా దేశ ఎన్నికల చరిత్రలో నమోదైంది. ఇలా రాజంపేటకు తొలినాళ్లలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది.
స్వతంత్ర పార్టీకి అవకాశం
రాజంపేట ఓటర్లు కాంగ్రెస్ హవాలోనూ స్వతంత్య్ర పార్టీ అభ్యర్థి సీఎల్.నరసింహారెడ్డిని గెలిపించారు. 1962లో దేశంలో ఆపార్టీకి 18 ఎంపీ స్థానాలు దక్కగా అందులో రాజంపేట ఒకటి కావడం విశేషం. 1967 నుంచి 1980 వరకు నాలుగుసార్లు పి.పార్థసారధి ఎంపిగా గెలిచారు. 1984లో టీడీపీ నుంచి పాలకొండ్రాయుడు ఎంపీగా గెలిచారు. 1989 నుంచి 1998 వరకు, 2004, 2009 వరకు కాంగ్రెస్ నుంచి సాయిప్రతాప్ ఎంపీగా గెలిచారు. 1999లో టీడీపీ నుంచి రామయ్య ఎంపీగా గెలిచినా పార్లమెంటు ఎన్నిక చరిత్రలో అత్యల్ప మెజార్టీ వచ్చింది ఈయనకే. ఆ ఎన్నికలో కేవలం 27,170 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇందులో సాయిప్రతాప్ డబుల్ హ్యాట్రిక్ చేయగా పార్థసారధి నాలుగుసార్లు గెలిచారు. వీరి తర్వాత మిథున్‌రెడ్డి వరుసగా హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు.
సాయి
ప్రతాప్
ఈ పార్లమెంటు స్థానానికి దేశ రాజకీయాల్లో గుర్తింపు
1957లో ఇక్కడి ఎంపీ టీఎన్.విశ్వనాథ రెడ్డి ఏకగ్రీవం
ఎంపీగా గెలిచిన వారిలో అత్యధిక మెజార్టీ మిథున్‌రెడ్డిదే
ఇప్పుడు నాలుగుజిల్లాల్లో పార్లమెంటు పరిధితోనూ రికార్డే
విశ్వనాథ రెడ్డి, మిథున్‌రెడ్డి మినహాఅందరూ కడపనేతలే
1952 నుంచి 2019 వరకు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం కడప–చిత్తూరుజిల్లాల పరిధిలో ఉండేది. 2022 ఏప్రిల్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుతో అన్నమయ్యలో ఆరు, చిత్తూరులో ఒక నియోజకవర్గంతో ఉండేది. తాజాగా అన్నమయ్య, చిత్తూరుజిల్లాల్లో జరిగిన మార్పులతో రాజంపేట పార్లమెంటు స్థానం నాలుగుజిల్లాల పరిధిలోకి వచ్చింది. ఏడు నియోజకవర్గాల్లో రాజంపేట వైఎస్సార్ కడపజిల్లా, కోడూరు తిరుపతిజిల్లా, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాలు మదనపల్లె జిల్లా కేంద్రమైన అన్నమయ్యజిల్లా పరిఽధిలోకి వచ్చాయి. పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచర్ల, పులిచర్ల మండలాలు చిత్తూరుజిల్లాలో విలీనం చేయడంతో రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం నాలుగుజిల్లాల పరిధిలోకి వచ్చింది. ఇలా ఎంపీకి నాలుగుజిల్లాల్లో ప్రాతినిథ్యం ఏర్పడింది.
నాలుగు జిల్లాల సీటు!
నాలుగు జిల్లాల సీటు!


