ఒక్కొక్క అర్జీకి రూ.100
మదనపల్లె రూరల్: మదనపల్లె కేంద్రంగా అన్నమయ్యజిల్లా ఏర్పాటైన తర్వాత మొదటిసారి జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమాని కి ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తమ సమస్యలను అధికారులకు చెప్పుకునేందుకు అర్జీలు రాయించుకునేందుకు కలెక్టరేట్ ఎదుట కూర్చున్న రైటర్లను ఆశ్రయించారు. అమాయక పేదల అవసరాన్ని అవకాశంగా తీసుకుని అర్జీకి రూ.100 చొప్పున వసూలుచేశారు. దీనిపై చాలామంది పేదలు గతంలో సబ్ కలెక్టర్ కార్యాలయంగా ఉన్నప్పుడు అర్జీకి రూ.30 వసూలు చేసే వారని, ఇప్పుడు రైటర్లు పెరిగారు.. రేటు కూడా పెంచేశారంటూ వాపోయారు. ఒకరిద్దరైతే, అంత డబ్బులు ఇవ్వలేమంటూ రైటర్లతో వాదులాడటం కనిపించింది. వృద్ధులు, చదువురాని గ్రామీణ ప్రజల కోసం అర్జీలు రాయించి ఇచ్చేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటుచేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
● కలెక్టరేట్ ఎదుట రైటర్ల దోపిడీ
● ఇచ్చుకోలేమంటున్న పేదలు


