
రెడ్డెమ్మకొండలో భక్తుల రద్దీ
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం ఉదయం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కుబడులు చెల్లించుకొన్నారు. ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా భక్తులు అమ్మవారి ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించారు.
జిల్లా జూనియర్ బాల,బాలికల
షూటింగ్ బాల్ జట్ల ఎంపిక
మదనపల్లె సిటీ : మదనపల్లె పట్టణం పుంగనూరు రోడ్డులోని గ్రీన్‌వ్యాలీ స్కూల్‌లో ఆదివారం జిల్లా షూటింగ్ బాల్ బాల,బాలికల జట్ల ఎంపిక జరిగింది. జిల్లా నలుమూలల నుంచి సుమారు వందమంది క్రీడాకారులు పాల్గొన్నారని అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గౌతమి తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు సెప్టెంబర్ నెలలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంటులో పాల్గొంటారని తెలిపారు. జిల్లా అసోసియేషన్ చైర్మన్ జునైద్ అక్బరీ అభినందించారు. కార్యక్రమంలో ఏషియన్ గోల్డ్ మెడలిస్టు యూసుఫ్, అసోసియేషన్ సభ్యులు భారతి, మండల స్కూల్ గేమ్స్ కో ఆర్డినేటర్ శివశంకర్, సెలక్షన్ కమిటీ సభ్యులు కుమార్ నాయక్, జయంత్, తిరుమలేష్, పీడీలు గురు, మణి, లత, మంజుల, చిన్నప్ప, మౌనిక పాల్గొన్నారు.
కలకలం రేపుతున్న క్షుద్ర పూజలు
సింహాద్రిపురం : మండల కేంద్రంలో క్షుద్ర పూజలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ కలకలం రేపుతున్నాయి. మండల కేంద్రంలో ఈద్గా సమీపంలో వెన్నపూసపల్లెకు వెళ్లె దారిలో క్షుద్ర పూజలు పలుమార్లు జరుపుతున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు. ఎందుకు చేస్తున్నారో అర్థం కాక ఆ దారిన తరచూ వెళ్లే రైతులు, అలాగే మహిళలు భయాందోళనకు గురవుతున్నారు.

రెడ్డెమ్మకొండలో భక్తుల రద్దీ