
ఉత్సవం.. కారాదు విషాదం
● నేడు ప్రారంభం కానున్న వినాయక చవితి వేడుకలు
● జాగ్రత్తలు పాటిస్తే మేలు ● అత్యుత్సాహం వద్దు
రాజంపేట టౌన్ : జీవితం ఎంతో విలువైనది. అయితే కొంత మంది పండుగలు, ఉత్సవాల సందర్భంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శించే క్రమంలో.. ప్రాణాలనే పోగొట్టుకుంటుండటం చాలా బాధాకరం. ముఖ్యంగా వినాయక చవితి వేడుకలు అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలోనూ ఆనందం ఉరకలేస్తుంది. ఆ సమయంలో కొంత మంది వివిధ విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి కొన్ని సందర్భాల్లో ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. ప్రతి ఏడాది వినాయక చవితి వేడుకల సందర్భంగా ఏదో ఒకచోట విషాద సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎలాంటి అపశ్రుతులు లేకుండా వేడుకలు సంతోషంగా ముగియాలంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. బుధవారం నుంచి వినాయక చవితి వేడుకలు ప్రారంభం కానున్నందున పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్ని చోట్ల ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. చవితి వేడుకల్లో జరుగుతున్న అపశ్రుతులను దృష్టిలో ఉంచుకొని పోలీసు అధికారులు ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకోవాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పోలీసు అధికారుల సూచనలను పాటిస్తే వినాయక చవితి వేడుకలు ఆనందదాయకం కాగలవు.
గతంలో జరిగిన సంఘటనలు
రెండేళ్ల క్రితం వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ఓ వ్యక్తి పాతబస్టాండ్ సర్కిల్‌లో ట్రాక్టర్‌పై నుంచి ఫల్టీకొట్టబోయి అదుపు తప్పి.. తల మధ్యభాగం రోడ్డుకు బలంగా తగిలింది. దీంతో ఆ వ్యక్తి అక్కడే కదలలేని స్థితికి చేరుకొని జీవచ్చవంలా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఓ కార్పొరేట్ హాస్పిటల్‌లో చేర్పించగా తలలోని నరాలు బాగా దెబ్బతినడంతో దాదాపు పది రోజులు చికిత్స పొంది చివరికి మృత్యువాత పడ్డాడు. ఆయన అత్యుత్సాహం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
● 2021లో రాజంపేట పట్టణం కృష్ణానగర్‌కు చెందిన జగన్నాథం అనే విద్యార్థి.. వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న సమయంలో నీటమునిగి మృతి చెందాడు. వినాయకుడి ఊరేగింపు ఆలస్యం కావడంతో చీకటి పడింది. చీకటిలో వినాయకుడిని నీళ్లలోకి దించే క్రమంలో.. జగన్నాథం నీళ్లలోకి దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. ఆయన మృతి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.
● గతేడాది తుమ్మల అగ్రహారానికి చెందిన ఓ వ్యక్తి టపాసులున్న కవర్ పట్టుకొని ఉండగా.. టపాసుల అగ్గిరవ్వలు కవర్‌లో పడ్డాయి. దీంతో కవర్‌లో ఉన్న టపాసులన్ని ఒక్కసారిగా పేలడంతో చేతివేళ్లు తెగిపోయి చెయ్యి చిధ్రమయింది. దీంతో ఆయన డ్రైవర్ వృత్తికి దూరం కావాల్సి వచ్చింది.
ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
● వినాయకుడిని కొలువు దీర్చేందుకు మండపాలు కట్టే సమయంలో విద్యుత్
షాక్ కొట్టకుండా తగు ఏర్పాట్లు చేసుకోవాలి.
● భారీ విగ్రహాలను వాహనాల్లోకి ఎక్కించే, మండపాల్లో కొలువు
దీర్చే సమయంలో పిల్లలను దూరంగా ఉంచాలి.
● మండపాల్లో దీపాలను వెలిగించే సమయంలో డెకరేషన్‌కు సంబంధించిన
దుస్తులు, పేపర్‌లు వంటివి దగ్గరలో లేకుండా చూసుకోవాలి.
● విగ్రహాలను చీకటి పడకముందే నిమజ్జనం చేయాలి.
● నిమజ్జనం చేసే సమయంలో పెద్దలు మాత్రమే నీటిలో దిగాలి.
● కర్రసాము వంటివి చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
● ఊరేగింపు సమయంలో విద్యుత్ తీగలు తగలకుండా చూసుకోవాలి.
ప్రాణాలు వెలకట్టలేనివి
ఈ ప్రపంచంలో ఒక్కసారి పోతే తిరిగి తెచ్చుకోలేనిది ప్రాణం ఒక్కటే. వినాయక చవితి వేడుకల సందర్భంగా ప్రజలు, భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. – బి.నాగార్జున, అర్బన్ సీఐ.

ఉత్సవం.. కారాదు విషాదం