
స్కౌట్ యూనిట్ ఏర్పాటు తప్పనిసరి
రాయచోటి : అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో స్కౌట్ యూనిట్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం సూచించారు. రాయచోటిలోని డైట్ కేంద్రంలో మంగళవారం పీఎంశ్రీ (ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పాఠశాలల ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు, యూనిట్ లీడర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో ఉన్న 39 పీఎంశ్రీ పాఠశాలల్లో స్కౌట్ కార్యకలాపాల కోసం సమగ్ర శిక్షణ ద్వారా కేటాయించిన రూ.50 వేలను నిబంధనల ప్రకారం ఖర్చు చేయాలని తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి స్కౌట్ శిక్షణ దోహద పడుతుందన్నారు. అనంతరం స్కౌట్‌లో శిక్షణ పూర్తి చేసిన యూనిట్ లీడర్లకు ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కౌట్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి, అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ లక్ష్మీకర్, సమగ్ర శిక్ష అసిస్టెంట్ ఏఎంఓ షపీవుల్లా, స్కౌట్ మాస్టర్, గైడ్ కెప్టెన్స్ పాల్గొన్నారు.