
పెట్రోల్ బంక్ సొమ్ము కేసులో విచారణ వేగవంతం
రాజంపేట : రాజంపేట ఆర్టీసీ పెట్రోలు బంక్‌లో పక్కదారి పట్టిన సొమ్ము కేసులో విచారణవేగవంతమైంది. రూ.65 లక్షలు నిధుల స్వాహా అయినట్లు నిర్ధారణ చేసుకొని జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడుకు ఆర్టీసీ డీపీటీఓ రాము విచారణ చేపట్టి ఫిర్యాదుచేశారు. ఎస్పీ ఆదేశాలతో టౌన్ సీఐ నాగార్జున విచారణ చేసి ఆర్టీసీ డిపో ఉద్యోగులు పీఆర్‌నాయుడు, పీఎల్ నరసారెడ్డిలతోపాటు, పెట్రోలు బంకులో పనిచేసే 29 మందిపై కేసు నమోదు చేశారు. 9 నెలల పాటు పెట్రోలు బంకు నిర్వహణలో రూ.65,15,607 నిధులు స్వాహా అయినట్లు విచారణ అధికారులు తేల్చారు.
ఎలా జరిగిందంటే..
రాజంపేట ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఉన్న స్థలాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు లీజుకు ఇచ్చారు. అగ్రిమెంట్ చేసుకొని పెట్రోలు బంకు ఏర్పాటుచేశారు. గత ఊడాది డిసెంబర్ 7న మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి దీనిని ప్రారంభించిన సంగతి విదితమే. అద్దెను చెల్లిస్తూ బంకు నిర్వహణకు ఆర్టీసీ డిపో ఉద్యోగి రాజశేఖర్‌నాయుడును నియమించారు. పెట్రోలు పట్టేందుకు నంద్యాలకు చెందిన చంద్రమోహన్‌కు కాంట్రాక్టు ఇచ్చారు. దీంతో తొమ్మిది మంది ఇంజినీరింగ్ విద్యార్ధులు, మరో 20 మంది స్థానిక సిబ్బందిని నియమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు నిర్వహణ విషయంలో అక్రమాలకు పాల్పడ్డారు. తొమ్మిది నెలల పాటు అప్పనంగా రూ.25 లక్షల వరకు స్వాహా చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా రికార్డులో నమోదు చేశారు. ప్రతి రోజు బంక్‌లో వచ్చిన మొత్తం రాజంపేట ఎస్‌బీఐ అకౌంట్‌లో జమచేశారు. ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న శోభ వద్ద నగదు హ్యాండోవర్ చేస్తే ఆమె ఆ మరుసటి రోజుఆ బ్యాంకులో జమ చేస్తారు. పెట్రోలు బంకు నిర్వహణకు డీజల్ స్టాకు ఇండెంట్ కావాలంటే ఆర్టీసీ డీఎం రాయచోటి ఏఓ లోకనాథుడికి ఇండెంట్ పంపిస్తారు. ఇండెంట్ ప్రకారం ఫండ్‌ను విడుదల చేశారు. మొత్తాన్ని చెక్కు రూపంలో ఐఓసీఎల్ కంపెనీకి పంపిస్తారు. స్టాక్ తెప్పిచ్చి బంక్‌లో లోడింగ్ చేశారు. దీంతో ఇంజినీరింగ్ విద్యార్ధులు, కాంట్రాక్టరు కుమ్మకై ్క స్కానర్లు మార్చడంతోపాటు ఫోన్‌పే, గూగల్‌పే డిజిటల్ పేమెంట్‌లో పకడ్బందీగా రిజిష్టర్‌లో నమోదు చేసి లెక్కలు సరిపోయే విధంగా చూపించారు. ఆర్టీసీ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ నిధుల స్వాహాకు తెరతీశారు. రోజూ ఉదయం ఆరు గంటలకే బంక్‌లో డిప్‌డెన్సిటీ క్వాలిటీ రీడింగ్ చేసుకోవాలి. ఈ సమయంలో బంకులో ఎంత స్టాక్ వుందనేది పరిశీలించుకోవాలి. ఈ విధంగా చేయకపోవడం వల్ల మొత్తంమీద రూ.65 లక్షలు స్వాహా కావడానికి దారితీసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రూ.65 లక్షల స్వాహాపై డీపీటీఓ ఫిర్యాదు