
ఏపీలో ప్రజాస్వామ్య హననం
మదనపల్లె : మదనపల్లె మండలం బుద్ధునికొండ (నల్లగుట్ట)పై జులై 2న బుద్ధుడి విగ్రహం తలనరికిన ఘటనపై కార్యక్రమాల నిర్వహణకు అనుమతి లేకపోవడంతో శనివారం తమిళనాడు, కర్ణాటకలో దళిత సంఘాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. కర్ణాటక శ్రీనివాసపురంలో దళిత సంఘర్షణ సమితి (డి.ఎస్.ఎస్) ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, తహసీల్దార్ కార్యాలయం ఎదుట సభ జరిగాయి. తమిళనాడు పేర్ణంబట్టులో వీసీకే పార్టీ నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించింది.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య హననానికి పాల్పడుతోందని విమర్శించారు.
స్వయం సమృద్ధి సాధించాలి
రాయచోటి టౌన్ : స్వయం సహాయక సంఘాల ద్వారా స్వయంగా ఉత్పత్తులను తయారు చేసి వ్యాపారాలు సాగిస్తూ స్వయం సమృద్ధి సాధించాలని జిల్లా మెప్మా పీడీ పి. లక్ష్మిదేవి అన్నారు. శనివారం రాయచోటి మెప్మా కార్యాలయ ఆవరణంలో ఓపెన్ మెప్మా అర్బన్ మార్కెట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల సభ్యులు తమ ఇళ్ల వద్ద తయారు చేసే వస్తువులు, ఆహార పదార్థాలు విక్రయించుకునేందుకు ఇలాంటి వేదికలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో మెప్మా అధికారి అబ్బాస్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.
వరికోత వాహనం బోల్తా
బి.కొత్తకోట : తమిళనాడు నుంచి ములకలచెరువు వెళ్తున్న వరికోత యంత్రం కలిగిన వాహనం బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయడ్డాడు. శనివారం మండలంలోని జాతీయ రహదారి కనికలతోపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడు రాష్ట్రం సేలం నుంచి డ్రైవర్ యువరాజ్ (30) వరికోత యంత్రంతో మదనపల్లె నుంచి ములకలచెరువు వెళ్తున్నాడు. వాహనం ఇంజిన్ బోల్టు ఊడిపోవడంతో ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో డ్రైవర్‌కు గాయలయ్యాయి. బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. సీఐ గోపాల్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
విద్యార్థి ఆత్మహత్య
లింగాల : లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వెలుగు భానుప్రకాష్ (22) అనే విద్యార్థి నంద్యాల జిల్లా పాణ్యం ఆర్‌జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం విద్యార్థి కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భానుప్రకాష్ తల్లిదండ్రులు రాంభూపాల్, సరస్వతి హుటాహుటిన ఆర్‌జీఎం కళాశాల వద్దకు వెళ్లారు. అప్పటికే కళాశాల యాజమాన్యం, పోలీసులు భానుప్రకాష్ మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భానుప్రకాష్ శుక్రవారం ఆయన తండ్రికి తనకు ఆరోగ్యం బాగాలేదని, ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్ పెట్టాడని పోలీసులు తెలిపారు. దీనిపై భానుప్రకాష్ తండ్రి తాను మెసేజ్ చూసుకోలేదని, తనకు అంతటి చదువు రాదని కళాశాల యాజమాన్యం తన కుమారుడిని ఏమో చేసిందని విద్యార్థి తల్లిదండ్రులతోపాటు, బంధువులు ఆసుపత్రి వద్ద బోరున విలపించారు.

ఏపీలో ప్రజాస్వామ్య హననం

ఏపీలో ప్రజాస్వామ్య హననం