
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం
మదనపల్లె: జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపి వాటిని సంరక్షించాల్సిక కీలక బాధ్యత తహసీల్దార్లదే అని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. గురువారం స్థానిక ఆదిత్య కళాశాలలో డివిజన్‌లోని తహసీల్దార్లు, వీఆర్‌ఓలకు రెవెన్యూ పాలనలో పారదర్శకత, సమయపాలన, ప్రజా సమస్యల పరిష్కారంపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఆదర్శ్‌రాజేంద్ర, సబ్‌కలెక్టర్ చల్లా కళ్యాణీతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి కలెక్టర్ మాట్లాడతూ రీ సర్వేలో అనవసరంగా జాయింట్ ఎలిమెంట్స్ పెడితే రైతులు ప్రభుత్వ పథకాలు పొందడానికి ఇబ్బందులు పడతారన్నారు. ప్రభుత్వ భూములు, కాలిబాట, పాదదారి, బండిబాట, నీటి వనరులు, చెరువులు ఆక్రమణలకు గురైతే స్పష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా రెవెన్యూశాఖకు చెడ్డపేరు రాకుండా, నిజాయితీగా పని చేయాలని కోరారు. పీజీఆర్‌ఎస్ ద్వారా స్వీకరించిన వినతులు, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యల దరఖాస్తులు, భూ వివాదాలు, రీసర్వే, సుమోటో ఇంటిగ్రేటేడ్ సర్టిఫికేట్, ఏడీఎస్‌బీ పోర్టల్, రస్తా వివాదాల్లో రెవెన్యూ సిబ్బంది కీలక పాత్ర పోషించాలన్నారు. సమస్యలపై వచ్చే ప్రజలకు పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దని సూచించారు. నిర్లక్ష్యంగా సేవలు అందిచండం ద్వారా రెవెన్యూశాఖకు, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు జావాబుదారిగా పనిచేయాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపే అధికారులపై కఠినచర్యలు తప్పవని, ఉద్యోగ భద్రతను కోల్పోతారని హెచ్చరించారు.
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి