
శ్రీవారి భక్తులపై పోలీసుల దాడి అమానుషం
పీలేరు : అక్రమ లిక్కర్ కేసులో అరెస్టు అయిన రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ శ్రీవారి భక్తులు గోవిందనామస్మరణతో శ్రీవారి మెట్ల మార్గంలో ప్రశాంతంగా వెళుతున్న తరుణంలో పోలీసులు దాడి చేయడం అమానుషమని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పీలేరు నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి పాదయాత్రగా వెళుతున్న భక్తులపై పోలీసులు బూటు కాళ్లతో తన్నడం, కొట్టడం, ఈడ్చడం ఆటవిక చర్య అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ నాయకుల ఆదేశాలతోనే పోలీస్ అధికారులు ఇష్టానుసార వ్యవహరించారన్నారు.
మదనపల్లె : శ్రీవారి మెట్ల మార్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని కాలినడకన శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి, విద్యార్థి సంఘం నాయకుడు చక్రీధర్‌ను చిత్రహింసలకు గురిచేయడం అన్యాయమన్నారు. నియోజకవర్గ స్టూడెంట్ యూత్ అధ్యక్షుడు అశోక్ రాయల్, సోషల్ మీడియా అధ్యక్షుడు సోము, పూర్ణ, పాదం దీపక్, బాలకృష్ణ, కౌశిక్ రెడ్డి, శివ, అనిల్, చరణ్, అష్రఫ్ పాల్గొన్నారు.

శ్రీవారి భక్తులపై పోలీసుల దాడి అమానుషం