ఆపిల్‌ ధర మించిపోయిన టమాటా | Sakshi
Sakshi News home page

ఆపిల్‌ ధర మించిపోయిన టమాటా

Published Wed, Jul 26 2023 10:04 AM

- - Sakshi

భారత దేశ చరిత్రలో టమాటా ధరలు టాప్‌ లేచిపోయాయి. టమాటాల చరిత్రలో మార్కెట్లో మంగళవారం అత్యధిక ధర పలికాయి. మంగళవారం మార్కెట్లో 30 కిలోల టమాటా ధర రూ.4,200 ధర పలికింది. కిలో టమాటా ధరలు రూ.140 వరకు ఽవేలం పాటలో వ్యాపారులు పాడుకొన్నారు. దేశంలో ఆపిల్‌ ధరలు అత్యధికంగా ఉండగా ఆపిల్‌ను అధిగమించి ఈరోజు టమాటాలు మార్కెట్లో మొదటిస్థానంలో నిలిచాయి. ఒక క్రీట్‌ టమాటా ధర ఇంచుమించుగా ఒక గ్రాము బంగారం ధరకు సమానంగా ఉండడం చరిత్రలో ఇదే మొదటిసారని రైతులు చర్చించుకోవడం గమనార్హం

గుర్రంకొండ: అన్నమయ్య జిల్లాలో సాగు చేసిన టమాటాలకు దేశంలో అత్యధికంగా ధర పలికింది. మంగళవారం మదనపల్లె, గుర్రంకొండతో పాటు జిల్లాలోని పలు మార్కెట్‌యార్డుల్లో టమాటా ధరలు అత్యధికంగా కిలో రూ.140 వరకు పలికాయి. 30 కిలోల టమాటా ఽక్రీట్‌ ధర రూ.4200 వరకు ధర పలికాయి. దీంతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో టమాటా దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది.

ఓవైపు అధిక వర్షాలు, మరోవైపు వైరస్‌, ఇతర రోగాలతో పలు రాష్ట్రాలలో టమాటా తోటలు భారీగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జిల్లాలో ముఖ్యంగా పడమటి ప్రాంతాలైన (పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె) నియోజకవర్గాల్లో ఎంతో కొంత టమాటా దిగుబడి వస్తోంది. వారం రోజుల క్రితం వరకు టమాటా ధర క్రీట్‌ రూ.3500 నుంచి రూ.3800 వరకు ధరలు పలికాయి. మంగళవారం నిర్వహించిన వేలం పాటల్లో టమాటా ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటడంతో అందరూ ఆశ్చర్య పోయారు. టమాటా పంట దిగుబడి రోజు రోజుకు తగ్గిపోతుండడంతో మార్కెట్లో ధరలు భగ్గుమంటున్నాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి.

► జిల్లా మొత్తం మీద 945 క్వింటాళ్ల టమాటాలు మార్కెట్లోకి వచ్చాయి. మొదటి రకం కిలో టమాటా ధర రూ. 140 కాగా రెండవ రకం కిలో రూ.110, మూడవ రకం కిలో రూ. 80 వరకు ధర పలకడం విశేషం. బయట రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వ్యాపారులు జిల్లాకు తరలివచ్చి ఇక్కడ మకాం వేశారు. మార్కెట్లో టమాటాలను కొనుగోలు చేసి వారి రాష్ట్రాలకు ఎగుమతి చేసుకొంటున్నారు. దేశంలో ఆపిల్‌ ధరల కంటే టమాటా ధరలు మించిపోవడం గమనార్హం. మార్కెట్లో టమాటాల డిమాండ్‌ ను బట్టి చూస్తే రాబోయే రోజుల్లో టమాటాల క్రీట్‌ధర రూ.5000 వరకు ధర పలుకుతాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నారు.

మార్కెట్లో అత్యధిక ధరలు ఇవే ..
దేశ చరిత్రలో టమాటా మార్కెట్లో అత్యధికంగా మంగళవారం టమాటా ధరలు పలికాయి. కిలో టమాటా రూ. 140 వరకు ధర పలికాయి. 30కిలోల టమాటా క్రీట్‌ ధర అత్యధికంగా రూ. 4200 వరకు ఽవేలం పాటలో వ్యాపారులు పాడుకొన్నారు. ఇంత పెద్ద ఎత్తున టమాటా ధరలు పెరగడం ఇదే మొదటిసారి. దేశవ్యాప్తంగా టమాటా దిగుబడి భారీగా తగ్గిపోయింది. అదే సమయంలో మన జిల్లాలో సాగు చేసిన టమాటాలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఏర్పడింది. బయట రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి టమాటాలను కొనుగోలు చేసి వారి రాష్ట్రాలకు ఎగుమతి చేసుకొంటున్నారు. టమాటా దిగుబడి పెరిగితేనే మార్కెట్లో ధరలు తగ్గే అవకాశముంది.
– జగదీష్‌, మార్కెట్‌ కమిటీ కార్యదర్శి, వాల్మీకిపురం

Advertisement
Advertisement