● పోలీసులకు చిక్కిన మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
● రూ.40 లక్షల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
మదనపల్లెటౌన్ : చదివింది ఎంటెక్.. చేసేది చైన్‌స్నాచింగ్.. అడపాదడపా తాళం వేసిన ఇళ్లలో చోరీలు. ఒక మోస్ట్ వాంటెడ్, ఉన్నత విద్యావంతుడైన దొంగను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.40 లక్షల విలువైన 250 గ్రాముల బంగారు ఆభరణాలు, 930 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ వేంకటాద్రి మదనపల్లెలో మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. మదనపల్లి మండలం ఈశ్వరమ్మ కాలనీకి చెందిన కొరకూటి రాజేష్ (35) వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో నేరాల బాట పట్టాడు. బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేసే రాజేష్.. కరోనా సమయంలో ఉద్యోగం ఊడిపోయి మదనపల్లెకి వచ్చేశాడు. మదనపల్లెలోనే కొంత కాలంగా మూడు ప్రధాన నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల స్థానిక అనిబిసెంట్ రోడ్డులోని ఒక ఇంట్లో చొరబడి భారీగా బంగారు, వెండి ఆభరణాలను అపహరించాడు. గత ఏడాది మార్చి 24న దేవాలయం వీధిలో ఒక వృద్ధురాలి వద్ద నుంచి 30 గ్రాముల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న మళ్లీ దేవాలయం వీధిలోనే మరో వృద్ధురాలి మెడలోని 25 గ్రాముల బంగారు గొలుసును దొంగలించాడు.
ఎలా చిక్కాడంటే..
జిల్లా ఎస్పీ ఆదేశాలతో మదనపల్లి అడిషనల్ ఎస్పీ ఎం.వెంకటాద్రి పర్యవేక్షణలో అన్నమయ్య జిల్లా సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, 1 టౌన్ సీఐ కె.రాజారెడ్డి, ఎస్‌ఐ ఎస్‌కె. రహీముల్ల్లా, సీసీఎస్ ఎస్‌ఐ ఎం.కె నరసింహులు, వారి బృందం మార్చి 3న ఉదయం 8:30 గంటలకు దేవాలయం వీధిలో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ మూడు కేసులకు సంబంధించి మొత్తం రికవరీని పూర్తి చేశారు.
జిల్లా ఎస్పీ సూచనలు
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిసలై నేరాల బాట పట్టడం వల్ల వారి భవిష్యత్తు అంధకారమవుతోందని తెలిపారు. చదువుల్లో రాణించి జీవితంలో పైకి రావాలే తప్ప దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, నగదు రివార్డులను అందజేశారు.


