అంతర్‌ రాష్ట్ర బైక్‌ దొంగ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్‌ రాష్ట్ర బైక్‌ దొంగ అరెస్ట్‌

Mar 4 2026 7:32 AM | Updated on Mar 4 2026 7:32 AM

రూ.40 లక్షల విలువైన

24 మోటార్‌ సైకిళ్లు స్వాధీనం

ముఠాలోని మరో ముగ్గురు రిసీవర్ల అరెస్ట్‌

వివరాలు వెల్లడించిన ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి

రాయచోటి : అంతర్‌ రాష్ట్ర బైక్‌ దొంగను అరెస్టు చేసి, అతని నుంచి రూ.40 లక్షల విలువైన ఖరీదైన మోటార్‌ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి తెలిపారు. మంగళవారం రాయచోటిలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు. అన్నమయ్య జిల్లాతోపాటు పక్క జిల్లాలో వరుస మోటార్‌ సైకిల్‌ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక కిలాడీ దొంగ, అతడి వద్ద నుంచి బైకులు కొనుగోలు చేస్తున్న ముగ్గురు రిసీవర్లను పీలేరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని తెలిపారు. రాయచోటి పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన షేక్‌ ఆరీఫ్‌ (38) 2024 చివరి నుంచి చోరీల బాట పట్టాడన్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పగలు రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న బైకులను టార్గెట్‌గా చేసుకొని మాయం చేసేవాడన్నారు. అన్నమయ్య జిల్లాలోనే కాకుండా చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాలో తనదైన శైలిలో దొంగతనాలకు పాల్పడుతూ వచ్చారన్నారు. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో రాయచోటి, పీలేరు, కలకడ, సంబేపల్లి, మదనపల్లి, పుంగనూరు, చిత్తూరు జిల్లాలో చిత్తూరు టౌన్‌, పలమనేరు, తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణం, వైఎస్సార్‌ కడప జిల్లాలో కడప టౌన్‌, రాజంపేట పట్టణాల్లో బైకులను అపహరిస్తూ వచ్చాడన్నారు.

రికవరీ చేసిన వాహనాలు..

నిందితుడి నుంచి సుమారు రూ.40 లక్షలు విలువైన 24 మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో ఖరీదైన వాహనాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారన్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 17 రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ (బుల్లెట్‌), 5 బజాజ్‌ పల్సర్‌, ఒక హోండాషైన్‌, మరొకటి హీరో స్ల్పెండర్‌ ప్లస్‌ బైకులు ఉన్నాయన్నారు.

అరెస్టు చేసిన తీరు

పీలేరు మండలంలోని పొంతల చెరువు క్రాస్‌ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానస్పదంగా పోలీసులను చూసి పారిపోతున్న ఆరీఫ్‌ను అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు దొంగలించిన బైకులను తక్కువ ధరకు గుర్రంకొండ మండలం బలిజగడ్డకు చెందిన షేక్‌ బషీర్‌, షేక్‌ సయ్యద్‌ ముక్తియార్‌, రామసముద్రం మండలం చెంబకూరు గ్రామం అలీ కోటవీధికి చెందిన షేక్‌ మహమ్మద్‌లకు విక్రయించాడని తెలిపారు. వారి ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రజలు, వాహనదారులకు జిల్లా ఎస్పీ పలు కీలక సూచనలు చేశారు. వాహనదారులు తమ మోటార్‌ సైకిళ్లకు కేవలం హ్యాండిల్‌ లాక్‌ వేసి వదిలేస్తున్నారని, దొంగలు వీటిని సులభంగా విరగ్గొట్టి దొంగలిస్తున్నారని, కావున ప్రతి ఒక్కరూ తమ వాహనాలకు అదనపు సెంట్రల్‌ లాక్‌ (వీల్‌ లాక్‌) లేదా డిస్క్‌ లాక్‌ అమర్చుకోవాలన్నారు. అలాగే తక్కువ ధరకు వస్తున్నాయని ఆశపడి సరియైన పత్రాలు (ఆర్సీ, ఇన్సూరెన్సు) లేని సెకండ్‌హ్యాండ్‌ వాహనాలను కొనుగోలు చేయరాదని తెలిపారు. జిల్లా సరిహద్దులు, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. కేసులో సమర్థవంతంగా పని చేసిన రాయచోటి డీఎస్పీ ఎంఆర్‌ కృష్ణమోహన్‌, పీలేరు సీఐ యుగంధర్‌, ఎస్‌ఐలు లోకేష్‌, రహీం, పీలేరు పోలీసు సిబ్బంది, హెడ్‌ కానిస్టేబుల్స్‌ రాధాకృష్ణ, ముని సుందరం, శ్రీనివాసులు, సిబ్బందిలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement