గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజైన మంగళవారం వేకువజామునే మూలవర్లకు శుద్ధితోమాల సేవ, తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. స్వామివారి వాహన మండపంలో రంగురంగుల పుష్పాలతో అలంకరించిన సూర్యప్రభ వాహనంపై స్వామివారిని కొలువు దీర్చారు. మేళతాళాలతో భాజాభజంత్రీలతో గ్రామ వీధుల మీదుగా స్వామివారి ఊరేగింపు సాగింది. మధ్యాహ్నం స్వామివారి మండపంలో మూలవర్లకు ఊంజల్‌సేవ నిర్వహించారు. సాయంత్రం అందంగా అలంకరించిన చంద్రప్రభ వాహనంపై స్వామివారు కొలువు దీరి.. గ్రామ వీధుల మీదుగా ఊరేగారు. అనంతరం స్వామివారికి పార్వేట ఉత్సవం, దోపు తిరునాల వైభవంగా నిర్వహించారు. స్వామివారి వాహన మండపంలో అందంగా అలంకరించిన అశ్వవాహనంపై స్వామివారిని కొలువుదీర్చి గ్రామ వీధుల మీదుగా ఊరేగించారు. టీటీడీ కళాకారుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అంగరంగ వైభవంగా ఊరేగింపు సాగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామస్తులు భక్తులు పెద్ద ఎత్తున ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
నేటి కార్యక్రమాలు : మండలంలోని తరిగొండ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజైన బుధవారం వసంతోత్సవం, స్నపన తిరుమంజనం, చక్రస్నానం, ఊంజల్‌సేవ, తిరుచ్చి ఉత్సవం, ధ్వజావరోహణం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు గోపాలబట్టార్ తెలిపారు.


