సాక్షి, విజయనగరం: కొందరు తమ స్వార్థ ప్రయోజనాలతో వైఎస్సార్‌సీపీని వీడవచ్చని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పుడు కొందరిని విమర్శించిన టీడీపీ నేతలు.. ఇప్పుడు వారినే తమ పార్టీలోకి తీసుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో వైఎస్సార్‌సీపీని వీడిన వారిని ఉద్దేశించి ‘గడ్డి తిన్నవారే పార్టీ వీడారు’ అంటూ మండిపడ్డారు.
మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తాజాగా మాట్లాడుతూ..‘కొందరు తమ స్వార్థంతో పార్టీని వీడవచ్చు. గడ్డి తిన్నవారే పార్టీ వీడారు. వైఎస్సార్‌సీపీలో ఉన్న వాళ్లని బాలకృష్ణ, కళా వెంకటరావులు విమర్శించి ఇప్పుడు వారినే టీడీపీలోకి తీసుకున్నారు. ఇప్పుడు వాళ్లు పూనీతులు అయిపోయారా?. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అన్ని గ్రామాల్లో పోటీ చేయాలి. పుకార్లను నమ్మకుండా పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. గ్రామాల్లో ఏకాభిప్రాయంతో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
రెండేళ్లలో వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతాయి. టీడీపీ ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గించేశారు. అందువలన సుజల స్రవంతికి నీరు వచ్చే పరిస్థితి లేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ఎత్తిపోతల పధకంతో సాగునీరు ఇస్తాం. వైఎస్సార్‌సీపీ గుర్తింపు కార్డు ఉన్న వారంతా వైఎస్ జగన్ సైన్యం. రానున్న ప్రభుత్వంలో వీరిదే అధికారం అని కామెంట్స్ చేశారు.
ఇదీ చదవండి: స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ దూకుడు.. తొలి అభ్యర్థి ప్రకటన


