
- ఆరు నెలల్లోనే ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
- విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో తిరోగమనం
- ఫీజులందక విద్యార్థులకు ఇక్కట్లు
- ఆరోగ్యశ్రీ నిర్వీర్యం.. పడకేసిన ‘ఫ్యామిలీ డాక్టర్’
- భరోసా దక్కక అల్లాడుతున్న అన్నదాతలు
- ఎక్కడ చూసినా అవినీతి
- ఇలాంటి సమయంలోనే మనం ప్రజలకు తోడుగా నిలుద్దాం
- ప్రజలతో మమేకమై.. వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీద్దాం
- ప్రతి కార్యకర్తకు ఎక్స్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సప్ అకౌంట్లు ఉండాలి
- అన్యాయాలను ప్రశ్నిస్తూ గ్రామ గ్రామాన పోస్ట్‌లు చేయాలి
- వైఎస్సార్‌సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం
నేను జిల్లాల పర్యటన కార్యక్రమం మొదలు పెట్టేటప్పటికి గ్రామ, బూత్ కమిటీల నియామకాలు పూర్తి చేద్దాం. ఆ తర్వాత ప్రతి సభ్యుడికీ ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టా, ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్ అకౌంట్లు ఉండాలి. మన గ్రామంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి.
ఆస్పత్రిలో డాక్టర్ ఎందుకు లేడు? పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదు? అమ్మఒడి ఏమైంది? ఇలా ప్రతిదీ ఫొటో తీసి అప్‌లోడ్ చేయాలి. మనం చంద్రబాబు సహా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి నెగిటివ్ మీడియాతో యుద్ధం చేస్తున్నామని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. విప్లవ స్ఫూర్తితో వారి కుట్రలను తిప్పికొట్టాలి. – వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. దుర్మార్గ పాలన వల్ల ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. ప్రజలతో మమేకమవుతూ.. వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీద్దాం.. అరాచక పాలనపై పోరాటం చేద్దాం’ అని పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల పార్టీ ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై మార్గ నిర్దేశం చేశారు. ‘మనం కేవలం చంద్రబాబుతో మాత్రమే యుద్ధం చేయడం లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి చెడిపోయిన వ్యతిరేక మీడియాతో యుద్ధం చేస్తున్నాం. ఇంత మంది కలిసి చేస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పి కొట్టాలంటే వాళ్ల కంటే మనం బలంగా తయారు కావాలి.
అలా జరగాలంటే ప్రతి కార్యకర్త విప్లవ స్ఫూర్తితో పని చేయాలి’ అంటూ దిశా నిర్దేశం చేశారు. ‘మోసంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ప్రజల కోపానికి గురికాక తప్పదు. అప్పుడు వాళ్లు ఎంత దూరంలో పడతారంటే.. టీడీపీకి సింగిల్ డిజిట్ కూడా రాని రోజులు మనం చూస్తాం’ అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
ప్రతి ఇంటికీ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం
చంద్రబాబు ప్రభుత్వం వచ్చి దాదాపు ఆరు నెలలు కావస్తోంది. అంతలోనే ఇంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు. తొలిసారిగా చూస్తున్నాం. ఇలాంటి నేప«థ్యంలో మనమంతా కలిసికట్టుగా ఏం చేయాలని ఆలోచన చేసి ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం. మన ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఇవ్వాళ్టికి కూడా మన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచ్‌లు ఏ గ్రామానికైనా, ఏ ఇంటికైనా ఈ మంచి చేశామని చెబుతూ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలరు.
కేవలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రమే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేసిందని మనం సగర్వంగా చెప్పగలం. మామూలుగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో మేనిఫెస్టో అని రంగు, రంగుల కాగితాలు ఇచ్చి.. దాన్ని ఎన్నికలు అయిపోగానే చెత్తబుట్టలో పడేసే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి... తొలిసారిగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మనం తూచ తప్పకుండా అమలు చేశాం. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తూ... అందులో 99 శాతం వాగ్దానాలు అమలు చేశాం.
బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడే ఏ పథకం ఏ నెలలో ఇస్తామో ముందుగానే చెప్పడంతో పాటు సంక్షేమ కేలండర్‌ను విడుదల చేశాం. ఆ మేరకు క్రమం తప్పకుండా ఆ నెలలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశాం. చరిత్రలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాత్రమే ఇలా జరిగింది. ఆ రకమైన మంచి మనం చేశాం.
చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు.. పొరపాటున చేయి అటువైపు వెళ్లింది
ప్రతి ఇంటికీ మంచి చేసినా కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అందుకు కారణాలు ఏమైనా వాటిని పక్కన పెడితే.. మనకు గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు వస్తే.. ఈ సారి 40 శాతం ఓట్లు వచ్చాయి. జగన్ ప్రతి ఇంటికి పలావు పెట్టాడు.. కానీ చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు కాబట్టి పొరపాటున చేయి అటు వైపు పోయింది.
తీరా ఇవ్వాళ చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా లేదు.. అన్న మాట ప్రతి ఇంటిలోనూ వినిపిస్తోంది. ఆ రోజుల్లో మనం ఏ ఇంటికి పోయినా చిక్కటి చిరునవ్వుతో ఆహ్వానించారు. ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి తీవ్రంగా ప్రచారం చేశారు.
ఆ ఇంట్లో చిన్న పిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు అని, వాళ్ల తల్లులు కనిపిస్తే నీకు రూ.18 వేలు అని, అంతకన్నా పెద్దవాళ్లు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, ఆ ఇంట్లోంచి ఉద్యోగం చేసే వయస్సున్న పిల్లాడు వస్తే నీకు రూ.36 వేలు అని, ఆ ఇంట్లో రైతు కండువా వేసుకుని బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని చెప్పారు. మనం కుటుంబం మొత్తానికి సహాయం చేస్తుంటే.. టీడీపీ వాళ్లు ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తామని అబద్ధాలు చెబుతున్నారని చాలా మంది నాతో కూడా చెప్పారు. కానీ మనం అలా చేయలేదు.
అతి మంచితనం.. అతి నిజాయితీతో మళ్లీ అధికారంలోకి..
ఇవ్వాళ్టికీ నా దగ్గరకు వచ్చిన మన ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలు.. మీ దగ్గర అతి మంచితనం, అతి నిజాయితీ.. ఈ రెండూ మనకు సమస్యలు అంటున్నారు. కానీ రేపు మళ్లీ మనం ఈ గుణాలతోనే అధికారంలోకి వస్తాం. ఆరు నెలల కూటమి పాలనలో టీడీపీ కార్యకర్తలు ఏ ఇంటికి గర్వంగా వెళ్లలేని పరిస్థితి.
ఏ ఇంటికి వెళ్లినా చిన్న పిల్లలు నా రూ.15 వేలు ఏమైందని.. రైతులు నా రూ.20 వేలు ఏమైందని.. ఉద్యోగం కోసం వెతికే పిల్లలు నా రూ.36 వేలు ఏమయ్యాయని అడిగే పరిస్థితి ఉంది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేటతెల్లం అవుతున్నాయి. మరోవైపు వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోతున్న పరిస్థితులు.
ఈ బడులు మాకొద్దు అనే పరిస్థితిలోకి నెట్టేశారు
స్కూళ్లలో నాడు–నేడు లేదు. ఇంగ్లిష్ మీడియం లేదు. మన హయాంలో రోజుకొక మెనూతో భోజనం పెట్టే గోరుముద్ద ఉండేది. ఇవ్వాళ అధ్వాన్న పరిస్థితుల్లో మధ్యాహ్న భోజనం ఉంది. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లు, టోఫెల్ ఎత్తివేశారు. ఎనిమిదో తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కూడా గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన హయాంలో ఆరో తరగతి నుంచి డిజిటిల్ క్లాస్ రూములు తయారు చేశాం.
మన హయాంలో ప్రైవేటు స్కూళ్లు ప్రభుత్వ స్కూళ్లతో పోటీ పడతాయా అన్న పరిస్థితి నుంచి.. ఇవాళ పూర్తిగా తిరోగమనంలోకి వెళ్లిపోయాయి. ఇవాళ గవర్నమెంటు బడులు మాకు వద్దు.. అని పేదవాడు అనుకునే పరిస్థితుల్లోకి నెట్టేశారు. అమ్మఒడి గాలికి ఎగిరిపోయింది. విద్యా దీవెన, వసతి దీవెన కూడా ఇవ్వడం లేదు.
ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న పిల్లలకు ప్రతి క్వార్టర్ ముగిసిన వెంటనే నాలుగో నెల వెరిఫై చేసి ఐదో నెల ఇచ్చే వాళ్లం. ఈ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ నాలుగు త్రైమాసికాలకు సంబంధించి బకాయిలు పెట్టారు. ఫీజు కట్టకపోతే ఒప్పుకోమని కాలేజీల యాజమాన్యాలు పిల్లలను ఇంటికి పంపిస్తున్నాయి.
జిల్లాల్లో పర్యటిస్తా.. అక్కడే నిద్ర చేస్తా..
రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి. నా జిల్లాల పర్యటన కార్యక్రమం సంక్రాంతి తర్వాత జనవరి మూడో వారం నుంచి ప్రారంభం అవుతుంది.అక్కడే నిద్ర చేస్తాను. ప్రతి బుధ, గురువారం ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో రెండు రోజులు అక్కడే ఉంటాను. కార్యకర్తలతో మమేకం అవుతాను. ‘కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశ నిర్దేశం’ పేరుతో ఈ కార్యక్రమం చేపడతాను.
పార్టీ గట్టిగా నిలబడాలంటే ఆర్గనైజేషన్ బలంగా ఉండాలి. ప్రతి గ్రామంలో, మండలంలో, నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలంగా ఉంది. దీన్ని మరింత బలోపేతం చేయాలి. నా పర్యటనలోగా జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పార్టీ కమిటీలు పూర్తి చేయాలి. విప్లవ స్ఫూర్తితో పని చేసి మనం మరింత బలంగా తయారవ్వాలి.
గ్రామ స్థాయిలో కమిటీల నియామకాలు పూర్తయ్యాక ప్రతి సభ్యుడి ట్విటర్ (ఎక్స్), ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సప్, యూట్యూబ్ తదితర అన్ని అకౌంట్లు ఉండాలి. ఆయా గ్రామాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఎప్పటికప్పుడు పోస్టులు పెట్టాలి.
దయనీయంగా వైద్య రంగం
వైద్య రంగం పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులకు మార్చి నుంచి ఇంత వరకు బిల్లుల చెల్లింపు లేదు. మార్చి నుంచి నవంబర్ వరకు లెక్కిస్తే.. ఇప్పటికీ ఇంకా రూ.2,400 కోట్లు బకాయిలు ఉన్నాయి. నెట్‌వర్క్ ఆస్పత్రులకు పేదలు వెళితే వైద్యులు మేం వైద్యం చేయలేమనే పరిస్థితి. 104, 108కు సంబంధించి ఆగస్టు నుంచి బకాయిలు ఇవ్వడం లేదు. నడపలేని పరిస్థితి. కుయ్.. కుయ్.. మంటూ రావాల్సిన అంబులెన్స్‌లు చతికిల పడుతున్నాయి.
మన ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని 3,350 రోగాలకు పెంచి రూ.25 లక్షల వరకు చికిత్స అందించాం. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉండకూడదని జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆస్పత్రిలో డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలతో మందులు ఇచ్చేలా మార్పులు తీసుకొచ్చాం. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేసి, ప్రతి 15 రోజులకొకమారు ఊరికే వచ్చి వైద్యం అందించే పరిస్థితి తీసుకొచ్చాం. ఇవాళ అంతా తిరోగమనం.
కుదేలైన వ్యవసాయ రంగం
వ్యవసాయ రంగం కూడా కుదేలైంది. ఆర్బీకేలు స్థాపించి, ఈ–క్రాప్ పెట్టి పారదర్శకంగా ప్రతి రైతుకు ఆర్బీకే ద్వారా ఉచిత పంటల బీమా అందించాం. దళారుల వ్యవస్థ లేకుండా ధాన్యం నేరుగా రైతు వద్దకే వచ్చి కొనుగోలు చేసే కార్యక్రమం మనం చేస్తే.. ఈ రోజు ఏ రైతుకూ ధాన్యానికి కనీస మద్దతు ధర రావడం లేదు. రూ.200 నుంచి రూ.300 తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఈ–క్రాప్ గాలికెగిరిపోయింది.
పారదర్శకత పక్కకు పోయింది. వ్యవసాయం తిరోగమనంలో ఉంది. డోర్ డెలివరీతో ప్రతి ప«థకాన్ని ఇంటికి అందించే పాలన మనదైతే.. ఈ రోజు డోర్ డెలివరీ మాట, మంచి పాలన దేవుడెరుగు.. టీడీపీ కార్యకర్తల చుట్టూ తిరిగితే తప్ప వచ్చే పరిస్థితి లేదు. ఇంత దారుణమైన పరిస్థితులున్నాయి. మళ్లీ పథకాలు ఎలా ఉన్నాయని హలో అని ఫోన్ చేసి అడుగుతామంటున్నారు. అసలు పథకాలుంటే కదా!
దోచుకోవడం.. పంచుకోవడం
రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది. ఇసుక రేట్లు చూస్తే.. మన కన్నా తక్కువ రేట్లకు ఇస్తామన్నారు. మన హయాం కంటే రెట్టింపు ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. మద్యం షాపులు ప్రభుత్వంలో ఉన్నవి తీసేశారు. ప్రతి గ్రామంలో వేలం వేసి రూ.2 లక్షలు, రూ.3 లక్షలకు బెల్టుషాపులు ఇచ్చేస్తున్నారు. లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా.. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు.
ఏ నియోజకవర్గంలో మైనింగ్ జరగాలన్నా, పరిశ్రమ నడవాలన్నా, ఏం జరగాలన్నా ఎమ్మెల్యేకు ఇంత, ముఖ్యమంత్రికి, ఆయన కొడుక్కు ఇంత అని దోచుకోవడం, పంచుకోవడం జరుగుతోంది. అందుకే కేవలం ఆరు నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. మనం ప్రజల తరఫున నిలబడాల్సిన సమయం వచ్చింది. ఆరు నెలల ప్రభుత్వ పాలన వేగంగా నడిచిపోయింది.
జమిలి అంటున్నారు.అందరం చురుగ్గా ప్రజల తరఫున పని చేయాలి. ప్రజల తరఫున గళం వినిపించాలి. మీ అందరినీ నేను ఒక్కటే కోరుతున్నా. ప్రతిఒక్కరూ ప్రజలకు తోడుగా, అండగా ఉండాలి. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న ఇలాంటి సమయంలోనే మనం ప్రజలకు అందుబాటులో ఉండాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి.