ఏపీవాసులకు బిగ్‌ అలర్ట్‌.. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు | Weather Forecast: IMD Announced Heavy Rainfall In AP For Next Four Days, Check Out Weather Details Inside | Sakshi
Sakshi News home page

AP Rainfall Alert: ఏపీవాసులకు బిగ్‌ అలర్ట్‌.. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

Aug 13 2025 3:48 PM | Updated on Aug 13 2025 4:21 PM

Weather Forecast: Andhra Pradesh Heavy Rains Updates

సాక్షి, విజయవాడ: ఏపీలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి  ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కృష్ణనది పరీవాహక ప్రాంత ప్రజలకు అధికారులు అలెర్ట్‌ జారీ చేశారు. విజయవాడలో బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గుణదల వంతెనపై నుంచి బుడమేరు ప్రవాహం కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నంలోని చినలంక, పెద్దలంక ప్రాంతాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తాడికొండ మండలం పొన్నెకల్లులో చెరువుకు గండి పడింది. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు కాజా  టోల్‌ గేట్‌ దగ్గర భారీగా వరద నీరు చేరుకుంది. కోల్‌కత్తా-చెన్నై జాతీయ రహదారిపై వాహనాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నిన్న(మంగళవారం) రాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి పలు గ్రామాలు జలమయమయ్యాయి. వాగులు పొంగి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామ శివారులో వాగు పొంగి జూలకల్లు పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో రహదారిపై నుండి పారుతున్న వరద నీరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాచేపల్లి పట్టణంలోని రజక కాలనీ, బొడ్రాయి సెంటర్‌తో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయి.

కేసానుపల్లి గ్రామంలో వాగు పొంగిపొర్లుతోంది. కారంపూడి-దాచేపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మాచవరం మండలం రుక్మిణి పురం గ్రామం వద్ద పిల్లేరు వాగు పొంగి పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాచవరం మండలం గాంధీనగర్ వద్ద వరద నీటితో వాగు పొంగి పొర్లడంతో మాచవరం-పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement