ఎయిమ్స్‌లో కనీస సౌకర్యాలు కరువు
●ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు, సహాయకులు
● పట్టించుకోని అధికారులు, కాంట్రాక్టర్లు
మంగళగిరి టౌన్ : వైద్యసేవలు అంటేనే గుర్తుకు వచ్చేది ఎయిమ్స్ వైద్యశాల. మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్యశాలలో వైద్యసేవల కోసం రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతిరోజు వేల సంఖ్యలో అనారోగ్య బాధితులు, సహాయకులు వస్తుంటారు. అయితే వారికి అందించే కనీస సౌకర్యాలు కరువయ్యాయి. రోగులు, సహాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీకావు. ఓ పక్క గంటల తరబడి ఓపీ దగ్గర నిలబడడమే కాకుండా, వైద్యులు రాసిన పరీక్షల కోసం వేచి ఉండాల్సి వస్తుంది. రోగులు, రోగి సహాయకులు టాయిలెట్స్ వినియోగించుకోవాలంటే మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. ఎయిమ్స్‌లో టాయిలెట్స్ సౌకర్యాలు మూతబడడంతో మహిళలు, వృద్ధులు బయటకు వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్టర్లు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ వైపు అధికారులు సైతం కన్నెత్తి చూడడం లేదు. ఎయిమ్స్ వైద్యశాలలో ప్రతి ఫ్లోర్‌లో టాయిలెట్స్ ఉన్నాయి. ఏ ఫ్లోర్‌లో చూసినా యూరినల్స్ కమోడ్స్ పని చేయకపోవడంతో కొందరు లెట్రిన్ కమోడ్స్‌ను వినియోగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అవి కూడా అరకొరగా ఉండడంతో పదుల సంఖ్యలో రోగులు, సహాయకులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. యూరినల్స్ తరువాత ఉపయోగించే వాష్ బేసిన్లు, ట్యాప్‌లు పనిచేయడం లేదు. అయితే కొందరు రోగులు అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని సమస్యను తెలుపగా, కొన్నిరోజుల క్రితం కాంట్రాక్ట్ కాలం పూర్తి అయ్యిందని, ప్లంబర్లు లేక అలాగే వదిలివేశారని తెలిపినట్లు సమాచారం. కాంట్రాక్ట్ కోసం టెండర్లు పిలిచారని కొత్తగా కాంట్రాక్టర్ వచ్చేవరకు ఈ పరిస్థితి తప్పదని చెప్పడం రోగులను విస్మయానికి గురిచేసింది. యూరినల్స్ పనిచేయకపోవడం, రోగులు, సహాయకులు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలిసినా పట్టించుకోవడం లేదని రోగులు విమర్శిస్తున్నారు. త్వరితగతిన కనీస సౌకర్యాలు కల్పించాలని రోగులు, సహాయకులు కోరుతున్నారు.
ఎయిమ్స్‌లో కనీస సౌకర్యాలు కరువు


