నిధుల దుర్వినియోగం కేసులో మరొకరు అరెస్ట్
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : మంగళగిరి మండలం కురగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) నిధుల దుర్వినియోగం కేసులో మరొకరిని అరెస్ట్ చేసినట్లు గుంటూరు సీసీఎస్ డీఏస్పీ బి.వి.మధుసూదనరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఏసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రాయల రమేష్‌బాబు, కొంత మంది ఉద్యోగులతో ఏకమై మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడ్డారని అన్నారు. సొసైటీ డిపాజిటర్ల నుంచి డిపాజిట్లు సేకరించారని చెప్పారు. డిపాజిటర్లకు నకిలీ బాండ్లను జారీ చేసి తామే నేరుగా వడ్డీ చెల్లిస్తూ, డబ్బును బ్యాంక్‌లో జమ చేయలేదన్నారు. ఆ విధంగా 72 మంది డిపాజిటర్ల నుంచి రూ.8,50,93,947లు స్వాహా చేశారని పేర్కొన్నారు. కురగల్లు పీఏసీఎస్‌లో 112 నకిలీ డిపాజిట్ బాండ్లను జారీ చేసి రైతులను మోసగించినట్లు పీఏసీఎస్ చైర్మన్ శీలం గోపయ్య మంగళగిరి రూరల్ పీఎస్‌లో అప్పట్లో ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టామని అన్నారు. నిధుల దుర్వినియోగం వ్యవహారంలో కురగల్లు సీఈవో రాయల రమేష్‌బాబుతోపాటు యరబ్రాలెం పీఏసీఎస్ సీఈవో తాడిబోయిన శ్రీకాంత్ పాత్ర ఉన్నట్లు బయటపడిందని పేర్కొన్నారు. ఈ మేరకు అతని కదలికలపై నిఘా ఉంచామని అన్నారు. బుధవారం అతనిని మంగళగిరి ఆర్‌టీసీ బస్టాండ్ వద్ద అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు.
తీగలాగితే డొంక కదిలింది..
యరబ్రాలెంకు చెందిన తాడిబోయిన శ్రీకాంత్ 2012 జులైలో కురగల్లు పీఏసీఎస్‌లో తాత్కాలిక గుమస్తాగా నెలకు రూ.3 వేల జీతంపై చేరాడని డీఎస్పీ అన్నారు. సీఈవో రాయల రమేష్‌బాబుతో పాటు మరి కొందరితో కుమ్మకై దొంగ లెక్కలు రాశారని చెప్పారు. డిపాజిట్‌దారులు డబ్బు జమ చేసినప్పుడు వారికిచ్చే బాండ్లపై అతను, సీఈవో సంతకాలు చేసి ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ శ్రీకాంత్ ఎప్పుడూ బాండ్లపై సంతకాలు చేయలేదని చెప్పారు. డిపాజిట్‌దారులు డిపాజిట్ చేసేందుకు వచ్చినప్పుడు వారి నుంచి డబ్బులు తీసుకునేవాడని అన్నారు. ఆ డబ్బులను సీఈఓకు అప్పగించి ఆ వివరాలు క్యాష్ బుక్‌లో నమోదు చేయకుండా సాధారణ డైరీలో నమోదు చేశాడని చెప్పారు. ఇది మోసం అని తెలిసి కూడా సొసైటీని అడ్డుపెట్టుకుని ఈ మొత్తం వ్యవహారంలో నిందితులు ఒక పథకం ప్రకారం కుమ్మక్కయ్యారని అన్నారు. తద్వారా రైతులకు నకిలీ బాండ్లు అందజేసి, వసూలు చేసిన సొమ్మును దారి మళ్ళించారని చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో కురగల్లు సీఈవో రాయల రమేష్ బాబును అరెస్టు చేసిన విషయం విదితమే.


