సివిల్ డ్రెస్‌లో వచ్చి ల్యాప్‌టాప్ తీసుకెళతారా?
పెదనందిపాడు పోలీస్ స్టేషన్ ఎదుట దళితుల ఆందోళన ఎస్‌ఐ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎస్సీ కాలనీ వాసులు
ప్రత్తిపాడు: జీపు కూడా లేకుండా సివిల్ డ్రెస్‌లో వచ్చిన పోలీసులు ల్యాప్‌టాప్ తీసుకువెళ్లాల్సిన అవసరం ఏముందని దళితవాడ ప్రజలు పెదనందిపాడు పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్‌ఐ తీరును నిరసిస్తూ తెల్లవారుజామున పోలీస్ స్టేషను ఎదుట ఆందోళన చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదనందిపాడులో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. పెదనందిపాడు ఎస్సీ కాలనీలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత స్థానిక కాలనీవాసులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. అనుమతుల్లేకుండా పెద్ద పెద్ద శబ్దాలతో అక్కడ డీజేలు ఏర్పాటు చేయడంతో వాటిని నిలుపుదల చేయించేందుకు పోలీసులు అక్కడకు వెళ్లారు. సివిల్ డ్రెస్‌లో అక్కడకు వచ్చిన ఎస్‌ఐ సత్యనారాయణ దురుసుగా వ్యవహరించి, లాప్‌టాప్ తీసుకువెళ్లిపోవడమే కాకుండా మాపై చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ స్థానిక దళితవాడవాసులు గురువారం తెల్లవారు జామున పోలీస్ స్టేషను ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి నేరం లేని వారిపై చేయి చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. చేయిచేసుకోలేదని అక్కడున్న సిబ్బంది స్థానికులతో వాదించడంతో ‘కొట్టలేదని గుండెలపై చెయ్యి వేసుకుని ఎస్‌ఐను చెప్పమను’ అంటూ మహిళలు, ప్రజలు మండిపడ్డారు. అనంతరం ఎస్‌ఐ కాలనీవాసులతో మాట్లాడి, పొరబాటు జరిగిందని సర్దిచెప్పడంతో కాలనీవాసులు శాంతించారు.
సివిల్ డ్రెస్‌లో వచ్చి ల్యాప్‌టాప్ తీసుకెళతారా?


