హోరాహోరీగా పోలురాధ ఎడ్ల పందేలు
చీరాల టౌన్: మండలంలోని ఈపూరుపాలెం పంచాయతీలోని బోయినవారిపాలెం గ్రామంలో శ్రీ కృష్ణ యాదవ యూత్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి పోలురాధ ఎడ్ల పందేలు హోరాహోరీగా జరిగాయి. బోయినవారిపాలెంలో నిర్వహించిన ఈ ఎడ్ల పోటీలను ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ప్రారంభించి, మాట్లాడారు. నూతన సంవత్సరం సందర్భంగా గత 23 సంవత్సరాలుగా రాష్ట్రస్థాయి పోలు రాధ ఎడ్ల పోటీలు నిర్వహించడం గ్రామానికే గర్వకారణం అన్నారు. గ్రామీణ వాతావరణంలో ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎడ్ల బలప్రదర్శన తిలకించడానికి, పోటీల్లో పాల్గొనేందుకు గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి పశుపోషకులు తరలివచ్చారు. పోటీల్లో 19 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. పోటీల్లో తమ సత్తా చాటేందుకు ఎడ్లు హోరాహోరీగా తలపడ్డాయి. రాష్ట్రస్థాయి పోటీలను తిలకించేందుకు చీరాల నియోజకవర్గంతోపాటు వివిధ మండలాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రేక్షకులు ఈలలు, కేరింతలతో బోయినవారిపాలెం హోరెత్తిపోయింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ పోటీలను ఫ్లడ్‌లైట్ల వెలుగులో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులతోపాటు అధిక సంఖ్యలో పశుపోషకులు, ప్రజలు పాల్గొన్నారు.
ప్రేక్షకులతో హోరెత్తిన బోయినవారిపాలెం
హోరాహోరీగా పోలురాధ ఎడ్ల పందేలు


