ఫ్లెక్సీల తొలగింపుపై వివాదం
పశ్చిమ ఎమ్మెల్యే ఫ్లెక్సీలు తొలిగించిన నగర పాలక సంస్థ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ మహిళా నాయకులు కమిషనర్ పులి శ్రీనివాస్ ఆదేశాలతోనే తొలగించారంటూ ఆరోపణ
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఎమ్మెల్యే గళ్లా మాధవి అనుచరులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను నగర పాలక సంస్థ సిబ్బంది గురువారం తొలగించడంపై వివాదం రాజుకుంది. గుంటూరు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మధ్య కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి. ఫ్లెక్సీల తొలగింపుతో ఇది తారాస్థాయికి చేరుకుంది. పశ్చిమ నియోజకవర్గంలో అధికార పార్టీ అభిమానులు, నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వేడుకలు ముగియకుండానే నగరపాలక సంస్థ సిబ్బంది గురువారం తొలిగించారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఆక్రమణల నిర్మూలన దళం సిబ్బందిని నిలదీశారు. అయితే సిబ్బంది ‘మీకు చేతనైంది చేసుకోండి’ అంటూ బెదిరించినట్లు మహిళా నాయకురాలు లాం నవమి ఆరోపించారు. ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తూ కమిషనర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని నియోజకవర్గ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యేను పట్టించుకోని కమిషనర్
పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవిని ఆది నుంచి కమిషనర్ పులి శ్రీనివాసులు బేఖాతరు చేస్తూ వస్తున్నారు. కమిషనర్ తీరుపై ఎమ్మెల్యే పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేసిన విషయం విదితమే.
పెమ్మసానికి ఎమ్మెల్యే ఫిర్యాదు
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్లా మాధవి గురువారం కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఫ్లెక్సీల తొలగింపు విషయాన్ని పెమ్మసాని దృషికి తీసుకెళ్లినట్లు సమాచారం. నగరపాలక సంస్థ కమిషనర్ తన మాటను బేఖతారు చేస్తున్నారని, కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. పెమ్మసాని నుంచి ఎలాంటి సమాధానం రాలేదని ఎమ్మెల్యే వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


