రక్తంతో రాసుకున్న చరిత్రే విశాఖ ఉక్కు కర్మాగారం | Vizag Steel Plant incident | Sakshi
Sakshi News home page

రక్తంతో రాసుకున్న చరిత్రే విశాఖ ఉక్కు కర్మాగారం

Jun 9 2026 8:13 AM | Updated on Jun 9 2026 10:53 AM

Vizag Steel Plant incident

ఒకప్పుడు అది కేవలం కల.. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అంటూ లక్షల గొంతులు మార్మోగాయి. ఆ కలను నిజం చేసేందుకు 32 మంది అమరులయ్యారు. వారి రక్తంతో రాసుకున్న చరిత్రే విశాఖ ఉక్కు కర్మాగారం. ఆ తర్వాత వేలాది కుటుంబాలకు అన్నం పెట్టిన ఆ ఉక్కు కర్మాగారం, కాలక్రమంలో ఎన్నో విషాదాలకు కూడా సాక్షిగా నిలిచింది. 2012లో ఆక్సిజన్‌ ప్లాంట్‌లో జరిగిన ఘోర పేలుడులో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఆ ప్రమాదం దేశంలోని ఉక్కు పరిశ్రమ చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు మళ్లీ అదే ఉక్కు కర్మాగారం రోదిస్తోంది. సోమవారం సాయంత్రం స్టీల్‌ మెల్టింగ్  షాప్‌లో సలసల కాగే ఉక్కు ద్రవం నేలపై చెల్లాచెదురుగా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే ఎనిమిది మంది కార్మికులు  అగ్నిజ్వాలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. ఆ ఆరుగురు కేవలం కార్మికులు కాదు.. 

ఎవరికో తండ్రి.. ఎవరికో భర్త.. ఎవరికో కొడుకు.. ఎవరికో అన్న.. ఉదయం ఇంటి నుంచి ‘సాయంత్రానికి వస్తా’ అని వెళ్లిన వారు, తిరిగి శవపేటికల్లో చేరుకోవడం ఎంతటి విషాదమో కదా.. ఉక్కు తయారవ్వాలంటే ఇనుము కరిగాలి. కానీ ప్రతిసారీ మనుషుల ప్రాణాలే కరగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది అనే ప్రశ్న మరోసారి ముందుకొచ్చింది. 

విశాఖ ఉక్కు కర్మాగారం గేట్లను చూస్తే ఇవాళ అవి ఇనుముతో చేసిన ద్వారాల్లా కాకుండా, కన్నీటి బిందువులతో తడిసిన చరిత్ర పుటల్లా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఉద్యమ అమరుల త్యాగాలు, మరోవైపు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కారి్మకుల జ్ఞాపకాలు.. ఈ రెండింటి మధ్య నిలబడి ఉక్కు కర్మాగారం మౌనంగా విలపిస్తోంది. ‘నన్ను నిర్మించడానికి ప్రాణాలు ఇచ్చారు.. నన్ను నడపడానికి కూడా ప్రాణాలే పోతున్నాయి..’ అని ఉక్కే కన్నీరు కారుస్తోంది. నేడు విశాఖ ఉక్కు కర్మాగారంలో ఎగసిపడుతున్న పొగల్లో కేవలం ద్రవ లోహం వేడి మాత్రమే కాదు.. ఎనిమిది కుటుంబాల కన్నీటి వేడి కూడా.. ఆ కన్నీరు ఆరిపోవచ్చు. కానీ ఈ విషాదం మిగిలి్చన గాయం మాత్రం చాలా కాలం వరకు మానదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement